నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక | YS Rajasekhara Reddy's historic praja prasthanam turns 14 years | Sakshi
Sakshi News home page

నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక

Published Sun, Apr 9 2017 3:23 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక - Sakshi

నిప్పులు కురిసే ఎండలో 68 రోజుల పాటు నడక

- 11 జిల్లాల్లో.. 56 నియోజకవర్గాల్లో ప్రయాణం
- రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి...
- శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు


సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం. రాష్ట్రమంతా కరవుతో అల్లాడుతున్న రోజులు. ప్రజల దీనావస్థలను పట్టించుకోకుండా ప్రభుత్వం అచేతనంగా ఉన్న కాలమది. వర్షాలు లేక, సాగు ముందుకు సాగక, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క... ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఆత్మహత్య తప్ప దిక్కులేదన్నట్టుగా కడు దయనీయ పరిస్థితుల్లో రైతులు. చేయడానికి పనులు లేక కూలీలు వలస బాట పట్టిన కాలమది. ఆర్చేవాళ్లు... తీర్చేవాళ్లు లేక అల్లాడుతున్న రోజుల్లో నేనున్నానంటూ ప్రజలకు ధైర్యం చెప్పడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలిబాటకు తొలి అడుగు వేసిన రోజుది.

మండుతున్న ఎండలను చూసి చాలా మంది వారించినప్పటికీ ప్రజల్లో విశ్వాసం నింపడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు ముందుకేశారు. ఆయన వేసిన ఆ అడుగే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. చేవెళ్ల నుంచి పాదయాత్రగా ప్రజాప్రస్థానానికి నాంది పలికారు. వర్షాలు లేవు... పంటలు అసలే లేవు. పనులు లేక కూలీలు వలస వెళుతున్న గడ్డు రోజులు. ఉపాధి లేక కార్మికులు, వృత్తి పనులు, చేతి పనులు చేసుకునే వాళ్లది దిక్కుతోచని స్థితి. గుక్కెడు మంచినీటి కోసం కిలోమీటర్ల మేరకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్న కాలం. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి భవిష్యత్తుపై వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేవెళ్ల నుంచి మహా ప్రస్థానానికి సిద్ధమయ్యారు. ఊరూరా... వాడవాడా తిరుగుతూ అధైర్య పడొద్దని వారిలో ధైర్యం నింపారు. రైతన్నలు, కూలీలు, కార్మికులు, వృద్ధులు, వృత్తి పనివాళ్లు... ఒకరేమిటి.. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కాలినడక యజ్ఞం పూర్తి చేశారు.

చేవెళ్ల నుంచి పడిన అడుగులు
2003 ఏప్రిల్‌ 9 న సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయన చేవెళ్ల నుంచి వేసిన అడుగు చరిత్రలో మరుపురాని ఘట్టంగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదో మైలురాయిగా నిలిచింది. పైనుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎర్రని ఎండను సైతం ఏమాత్రం ఖాతరు చేయకుండా 11 జిల్లాల గూండా 1470 కిమీల మేర నాలుక పిడస కట్టుకుపోయే ఎండలో ఆయన చేసిన పాదయాత్ర ఒక సాహసం. నిప్పుల కురిసే ఎండలో చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ సాగిన ఆయన పాదయాత్ర ప్రజలకు ఏదో చేయాలన్న ఉక్కు సంకల్పానికి పరాకాష్ట. ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న వైఎస్ ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిరాగానే వారిలో ధైర్యం నింపే అనేక నిర్ణయాలను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

2003 ఏప్రిల్‌ 9వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు నీరాజనం పలికారు. మొదటి రోజు నుంచి మొదలుపెడితే చివరి అడుగు వరకు లక్ష్యాన్ని చేరుకోవడంలో చెక్కుచెదరని విశ్వాసమే ఆయన్ను నడిపించింది. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయన పాదయాత్ర అత్యధిక భాగం పీపుల్స్‌వార్‌తోపాటు వివిధ నక్సలైట్‌ గ్రూపులకు కంచుకోటల వంటి మార్గంలో సాగింది. ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా అడుగుపెట్టని గ్రామాలకు వెళ్లడమే కాదు.. రాత్రుళ్లు అక్కడే గుడారాలు వేసుకుని బస చేశారు. తెలంగాణ ప్రజల అభిమానం తనను పులకరింప జేసిందని పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టబోయేముందు వైఎస్  చెప్పడం ఆయనకు రెండు ప్రాంతాలు ఒక్కటేనని చెప్పకనే చెప్పాయి.

ప్రాణాలు తీసే వడగాలుల్లో గోదావరి జిల్లాలోకి ప్రవేశం
తెలంగాణ కంటే భిన్నమైన వాతావరణంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. ప్రాణాలు తీసే వడగాలులను కూడా లెక్కచేయకుండా ఆ మహానేత తన పాదయాత్ర జరిపారు. సుమారు 30 వేల మంది ప్రజలతో చారిత్రాత్మకమైన గోదావరి రోడ్‌ కం రైలు వంతెనపై వైయస్‌ఆర్‌ చేసిన యాత్ర అపూర్వమైనది. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనా కేవలం ఐదే రోజుల విశ్రాంతి అనంతరం తన పాదయాత్ర ప్రస్థానాన్ని కొనసాగించారు. చికిత్స కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరాల్సిందేనని వైద్యులు పట్టుబట్టినా వినకుండా గుడారంలోనే విశ్రాంతి తీసుకుని ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్రకు ఆయన ప్రస్థానం కొనసాగింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం, జిల్లాలోని ఒరిస్సా సరిహద్దులలో ఉన్న ఇచ్ఛాపురం వద్ద పాదయాత్ర ముగిసింది. ప్రజా సమస్యలపై ఇంత కష్టసాధ్యమైన కార్యక్రమం చేపట్టిన నాయకులు గతంలో ఎవరూ లేరు. తరువాత కాలంలో చంద్రబాబు చేసిన ఎలా పూర్తి చేశారో అందరికీ తెలిసిందే.

పాదయాత్ర సాగిందిలా...

68 రోజులు.. 11 జిల్లాలు.. 1470 కిమీలు.. 56 నియోజకవర్గాలు
తొలి వారం : 2003 ఏప్రిల్‌ 9 నుంచి 15 వరకు.. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 159 కిమీలు
రెండో వారం : ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు.. మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో 159 కిమీలు
మూడో వారం : ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు.. నిజామాబాద్‌ జిల్లాలో 181 కిమీలు
నాలుగో వారం : ఏప్రిల్‌ 30 నుంచి మే 6 వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో 170 కిమీలు..
ఐదోవారం : మే 7 నుంచి 13 వరకు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 166
ఆరో వారం : మే 14 నుంచి మే 20 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో 103
ఏడో వారం : మే 21 నుంచి 27 వరకు తూర్పుగోదావరి జిల్లాలో 95 కిమీలు
ఎనిమిదో వారం : మే 28 నుంచి జూన్‌ 3 వరకు తూగో, విశాఖ జిల్లాల్లో 156.6
తొమ్మిదో వారం : జూన్‌ 4 నుంచి 10 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో.. 166
పదో వారం : జూన్‌ 11 నుంచి 15 వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం

56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 68 రోజుల పాటు 11 జిల్లాల్లో.. 1470 కిమీల పాదయాత్ర అంటే స‌గ‌టున రోజుకు దాదాపు 22కిమీల మేర ఆయ‌న పాద‌యాత్ర సాగ‌డం విశేషం.. అంటే నిప్ప‌లు కురిసే మండు వేస‌వి నెల‌లైనా ఏప్రిల్, మే, జూన్‌ల‌లో రోజుకు 22 కిమీలు న‌డ‌వ‌డం అంటే మామూలు విష‌యం కానేకాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement