
వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న షర్మిలమ్మ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ
వేంపల్లె: ఏసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె సెమీ క్రిస్మస్ వేడుక ల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, మనుమడు రాజారెడ్డి, మనుమరాలు అంజలి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ జయమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి వైఎస్ విమలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ థామస్‌రెడ్డి, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజక సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఇడుపులపాయకు వచ్చారు.
సోమవారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రేమించే వారందరిని కూడా ఏసు ప్రభువు సంతోషం, ప్రేమ, సమాధానం అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్, నరేష్‌ల ఆధ్వర్యంలో వైఎస్ కుటుంబసభ్యులు, బంధువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.