సమర దీక్షకు బయల్దేరిన విజయమ్మ
హైదరాబాద్ : అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలంటూ నేటి నుంచి సమర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గుంటూరు బయల్దేరారు. ఆమె ఈరోజు ఉదయం లోటస్ పాండ్ నుంచి బయల్దేరి విమానంలో ఉదయం 9.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ‘సమర దీక్ష’ ప్రారంభిస్తారు.
ఏకపక్షంగా, నిరంకుశ వైఖరితో అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేస్తున్నారన్న నిర్ణయం వెలువడిన నాడే సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారింది. జూలై 31వ తేదీ మొదలు మూడు వారాలుగా ఉద్యమంతో అట్టుడుకుతోంది. విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు.. అన్ని వర్గాల వారూ ఈ ఏకపక్ష విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో విజయమ్మ చేయనున్న దీక్షకు సకల వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.