
వైఎస్ వివేకా సమాధి వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ
వైఎస్‌ఆర్ జిల్లా, పులివెందుల/రూరల్ : మాజీ మంత్రి, దివంగత నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్దంతిని పులివెందులలో ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్ ఫ్యామిలీ సమాధుల తోటలో గల వైఎస్ వివేకా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వివేకా సోదరి విమలమ్మ, కుమార్తె సునీత, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి సతీమణి జయమ్మ, అల్లుడు రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, మైఖేల్ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి, క్రిష్టఫర్‌లు వివేకా సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఫాస్టర్లు నరేష్‌కుమార్, మృత్యుంజయల ఆధ్వర్యంలో వైఎస్ వివేకా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, లింగాల మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్, ఓ.రసూల్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్ వివేకా అని పేర్కొన్నారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైఎస్ వివేకా సోదరి వైఎస్ విమలమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలకు కుటుంబ సభ్యులంటే ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. ముఖ్యంగా సోదరిగా తనపట్ల మరింత ఎక్కువగా ప్రేమగా ఉండేవారన్నారు. కుటుంబ సభ్యులలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి వైఎస్ వివేకా అన్నారు. ఇటువంటి వ్యక్తి మనమందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ చరిత్రలో రాజకీయ శత్రువులు లేని అజాతశత్రువు లాంటి వారు వైఎస్ వివేకా అని ఇతర వక్తలు కొనియాడారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీత
రాష్ట్ర నలుమూలల నుంచి.. : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్దంతిని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలలనుంచి అనేకమంది నాయకులు, అభిమానులు పులివెందులకు చేరుకుని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు తమకు వైఎస్ వివేకానందరెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్దంతి సందర్భంగా వారం రోజులపాటు ఆయన జ్ఞాపకార్థం వైఎస్ వివేకా స్మారక క్రికెట్, కబడ్డీ, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు వైఎస్ వివేకా సోదరి విమలమ్మ, వైఎస్ షర్మిలమ్మ, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డిలు బహుమతులను ప్రదానం చేశారు.