సీఎం గారూ.. సొంత భజన మానండి: ధర్మాన
హైదరాబాద్: నవంబర్ 1 తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు లేవని ప్రభుత్వం చెప్పడం 13 జిల్లాల ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధర్నాన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాదని గెజిట్ లో స్పష్టంగా ఉంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను జరపవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందరో త్యాగధనుల ఆత్మార్ఫణ ఫలితంగా వచ్చిన రోజును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చడం ప్రజల మనోభావాలకు విరుద్ధం అని అన్నారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారనే ప్రభుత్వ ప్రకటనల్లో ఎంత నిజముందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వాస్తవ విరుద్ధ ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు.
చంద్రబాబు సొంత భజనమాని పరిపాలనపై దృష్టి పెట్టాలని ధర్మాన సూచించారు. తుఫాన్ నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని.. అందుకోసం మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డితో కలిసి ఓ ప్రతినిధి బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.