గుర్రాలతో తొక్కించిన బాబు...మళ్లీ అదే దమననీతి
హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ సీపీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్లు వంద రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్కు వస్తున్న యానిమేటర్లను ఎక్కడికక్కడే అరెస్ట్లు చేస్తూ ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
గతంలో అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు సర్కార్ ...మళ్లీ అదే దమననీతిని కొనసాగిస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు కానీ..ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయటం లేదన్నారు.
ఇంటికో ఉద్యోగం అన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని, దీంతో ఉద్యోగం లేక నిరుద్యోగులు, ఉన్న ఉద్యోగం కాపాడుకోవటం కోసం చిరుద్యోగులు భయపడుతున్నారన్నారు. ఉపాధి కోసం అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని, దీంతో రాష్ట్రం ధర్నాంధ్రప్రదేశ్గా మారిపోయిందని, ఈ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా సభ నుంచి వాకైట్ చేశామని ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్వేశ్వరరావు, వై. విశ్వేశ్వరరెడ్డి, ఐజయ్య, శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.