జైరాంపై చర్య తీసుకోవాలి: వైఎస్సార్‌సీపీ | Ysr congress party demands to take action on Jai ram Ramesh | Sakshi
Sakshi News home page

జైరాంపై చర్య తీసుకోవాలి: వైఎస్సార్‌సీపీ

Published Wed, Mar 5 2014 3:54 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

జైరాంపై చర్య తీసుకోవాలి:  వైఎస్సార్‌సీపీ - Sakshi

జైరాంపై చర్య తీసుకోవాలి: వైఎస్సార్‌సీపీ

ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు  
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి

 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సీమాంధ్రకు హామీలు గుప్పించిన  కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్ మంగళవారం ఎన్నికల కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.  మునిసిపల్ ఎన్నికల నియమావళి 3వ తేదీ 10గంటల నుంచే అమలులోకి వచ్చిందని, అయితే జైరాం రమేష్ విశాఖపట్నంలో మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏమేమి చేయబోయేది ప్రకటించారని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.
 
  సీమాంధ్రకు ప్రత్యేకహోదా కల్పిస్తామని రాజ్యసభలో ప్రధాని ప్రకటించినందున వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల గ్రాంటు లభిస్తుందని చెప్పారని, ప్రణాళికా సంఘం పేర్కొనక ముందే జైరాంరమేష్ ప్రకటించడం ఆశ్చర్యకరమని వారు పేర్కొన్నారు. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరు నెలలోపు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే అంతకు ముందే జైరాం వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేస్తామని ఎలా ప్రకటిస్తారని తమ ఫిర్యాదు లో ప్రస్తావించారు. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరునెలలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఐఓసీ’, ‘హెచ్‌పీసీఎల్’ ఆయిల్ కంపెనీలు, నూనెశుద్ధి కర్మాగారాన్ని నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే, సాధ్యాసాధ్యాల పరిశీలన ఏదీ లేకుండానే రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారని పేర్కొన్నారు. 4వ తేదీన గుంటూరులో జరిగిన సమావేశంలో కూడా జైరాం రమేష్ మళ్లీ ఇవే అంశాలు వెల్లడించారని వారు కమిషనర్ దృష్టికి తెచ్చారు.
 
 ఇంటికి పోయేవారా.. రాజధానిని నిర్ణయించేది?
 సీమాంధ్రుల రాజధాని ఎక్కడో నిర్ణయించేది నాలుగు రోజుల్లో ఇంటికిపోయే వారా అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని ఎక్కడ ఉండబోతోంది, ఎలా కట్టబోతున్నాం.. సచివాలయం ఫలానాచోట, హైకోర్టు బెంచీ ఫలానాచోట ఉండొచ్చు అని రకరకాలుగా చెబుతున్నారు. అలా మాట్లాడ్డానికి ఆయనెవరు?’’ అని నిలదీశారు. హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిని వికేంద్రీకరించాలని అనుకుంటున్నామన్న మంత్రి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘రాజధాని అంటే అన్ని కీలక అంగాలు ఒకచోట ఉండాలా.. లేదా? దేహానికి సంబంధించిన కిడ్నీలు ఒకచోట, లివర్ మరోచోట, గుండె ఇంకొకచోట ఉండేలా విడగొడితే మనుగడ సాధ్యమవుతుందా?’’ అని జూపూడి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement