'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది'
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆపార్టీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. తెలుగుదేశం పార్టీ అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. రైతు, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయాలని సామినేని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రిగా వైభవంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇప్పటికీ రుణమాఫీపై స్పషంగా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. వారి మోసాలకు ఇదే నిదర్శనమని సామినేని వ్యాఖ్యానించారు. బాబు ఎన్నికల ముందు ఒక మాట...ఆ తర్వాత ఇంకోమాట మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలు కూడా రద్దు చేశారని సామినేని ఉదయభాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.