రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని వెల్లడించారు. పశ్చిమగోదావరిలో శుక్రవారం నిర్వహించిన బంద్కు బాలరాజు, తోట చంద్రశేఖర్లు నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... విభజనతో సీమాంధ్ర ఎడారిగా మారుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విభజనపై బ్లాంక్ చెక్కులా కేంద్రానికి లేఖ ఇచ్చారు, అందువల్లే కాంగ్రెస్ పార్టీ విభజిస్తుందని ఆయన ఆరోపించారు. అటు తెలంగాణ ,ఇటు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని బాలరాజు జోస్యం చెప్పారు.
రాష్ట విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం సీమాంధ్రకు బ్లాక్ డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సమన్యాయం అంటూ నాటకాలు ఆడిన చంద్రబాబు వెంటనే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విభజనతో సీమాంధ్రకు న్యాయం జరగలేదు కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా సమైక్య లేఖ ఇవ్వాలని హితవు పలికారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే విభజన ఆగుతుందని ఆయన తోట చంద్రశేఖర్ వెల్లడించారు.