ఏలూరులో ఓటేసిన చంద్రశేఖర్
ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఏలూరు 28వ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్ కేపీడీటీ హైస్కూల్‌లో ఆదివారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన సోదరుడు తోట సత్యనారాయణ, కుమారుడు ఆదిత్య సైతం ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తీరు ఈ విషయూన్ని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కనీసం 35 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఏలూరు నగరాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తామని, సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, ఘంటా ప్రసాదరావు ఉన్నారు.