నిమ్మాడలో బాధితులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్ దౌర్జన్యాలకు మా భూములు కొన్ని సంవత్సరాలుగా కొర్నులుగా మారాయి... ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే తంతాం, చంపుతాం అంటూ బెదిరించారు... వారి ఆగడాలకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దశాబ్దాలుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా తలదాచుకుంటున్నాం... ఇప్పుడు అచ్చెన్నాయుడి అరెస్టుతో మా బతుకులు మారుతాయనే భరోసా కలిగింది... ముఖ్యమంత్రి చొరవ చూపి కింజరాపు సోదరుల నుంచి మాకు విముక్తి కలిగించాలి..
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన పట్ట ఎరకయ్య, మెండ రామ్ముర్తి తదితర బాధితుల ఆవేదన ఇది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టుపై టీడీపీ నాయకులు రేపుతున్న రాజకీయ దుమారానికి వ్యతిరేకంగా... వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు స్వస్థలం నిమ్మాడ గ్రామంలో మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మాడ జంక్షన్ నుంచి గ్రామం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో కలిసి వారి భూములను తిలక్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ... గత కొన్ని దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు, హరిప్రసాద్ చేస్తున్న దౌర్జన్యాలు ఇక సాగవని బాధితులకు భరోసా ఇచ్చారు. దశాబ్దాలుగా పీడిస్తున్న అచ్చెన్న ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయల అవినీతితో అడ్డంగా దొరికారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంతోపాటు కింజరాపు కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. నిమ్మాడతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో అచ్చెన్నాయుడు, ప్రసాద్ చేసిన ఆగడాలకు ఎంతోమంది బలైపోయారని... అటువంటి వారికి భరోసా కలిగించేందుకు నిమ్మాడ గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించామన్నారు.
గ్రామంలోని ఎఫ్‌సీఐ గొడౌన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నాయకుడు బోయిన రమేష్‌తో కలిసి ఎఫ్‌సీఐ గొడౌన్‌లో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు కన్నం వేశారని తిలక్ ఆరోపించారు. వీటితో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నారని దుయ్యబట్టారు. గత టీడీపీ పాలనలో బినామీ కాంట్రాక్ట్‌లతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తు చేశారు. బీసీ రుణాలు, హౌసింగ్, నీరు–చెట్టు, రోడ్లు నిర్మాణాలు ఇలా ఒకటేమిటి లెక్కలేని అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్నారని తిలక్ పేర్కొన్నారు. కింజరాపు సోదరుల అక్రమాలపై బలైపోయిన వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పడానికే నిమ్మాడ గ్రామం వచ్చామని తిలక్ స్పష్టం చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు, హరిప్రసాద్ అక్రమాల నుంచి విముక్తి కలిగించి నిమ్మాడ లో ప్రశాంతమైన పాలన అందజేసే విధంగా చూడాలని గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్‌రాజు, ఎ.రామారావు, బి.నాగేశ్వర్రావు, పి.వెంకట్రావు, పి.దాసు, కె.సంజీవరావు, డి.వెంకట్రావు, డి.సిమ్మన్న, ఎం.తాతయ్య, వి.అప్పారావు, బి.కామరాజు, టి.కామినాయుడు, టి.భాస్కర్రావు, బి.కృష్ణారావు, ఎం.శ్రీను, లక్ష్మణ్, ఎన్.శ్రీరామ్ముర్తి, బి.లక్ష్మీనారాయణ, జోగారావుతోపాటు కోటబొమ్మాళి మండలం వైఎస్సార్ సీపీ కార్యకర్తలంతా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment