'ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా మాతోనే'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. టీడీపీ చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించేలా వ్యవహరిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. అలాగే మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
గవర్నర్తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా తమతోనే ఉన్నారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమ డిమాండ్పై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు.