
ధర్మవరం ఐదోవార్డు శివానగర్‌లో ఓ వృద్ధుని సమస్య తెలుసుకుంటున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
అనంతపురం: వైఎస్సార్ సీపీ ప్రారంభించిన ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నేతలు ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాల గురించి తెలియజేస్తున్నారు. గురువారం అనంతపురం నగరం భవానీనగర్, రాణీనగర్, ఫెర్రర్‌కాలనీల్లో కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటూ రోగాలబారిన పడుతున్నామని మహిళలు షాహీదా, లక్ష్మీ, మాలతి, పార్వతమ్మ, లత వాపోయారు. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంకాలమ్మ గుడి అర్చకుడు లక్ష్మీనారాయణ ఆచారి తాను ఇంటి కోసం పడుతున్న ఇబ్బందులను అనంత వెంకటరామిరెడ్డి ఎదుట వాపోయాడు.
రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిందని ఆరోగ్యశ్రీ వర్తించలేదని, సీఎం సహాయ నిధి కింద కూడా ఆర్థికసాయం అందలేదని ఆటోడ్రైవర్ మహమ్మద్ అలీ గగ్గోలు పెట్టాడు. చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరించి, మరోసారి ఆయన మోసాల వలలో పడొద్దని చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు వివరించారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. గ్రామంలో రోడ్లు లేవని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు సుంకమ్మ, లక్ష్మీదేవి, నెట్టికంటమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వితంతు పింఛను మంజూరు చేయలేదంటూ లలితమ్మ అనే మహిళ వాపోయింది. ధర్మవరం పట్టణం 5వ వార్డు శివానగర్‌లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పర్యటించారు. కాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదని దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.
గుంతకల్లు నియోజకవర్గం పామిడి మునిసిపాలిటీ 7వ వార్డు, గుత్తి మండలం యంగన్నపల్లి, బేతాపల్లిలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమస్వయకర్త వై. వెంకటరామిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేశారు. కదిరి మున్సిపాలిటీ నాగిరెడ్డిపల్లి, పేరిపల్లి క్వార్టర్స్‌లో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి పర్యటించారు. మురుగుకాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా... పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. స్పందించిన సిద్ధారెడ్డి... సొంత నిధులతో శుభ్రం చేయించి మురుగునీటి కోసం గుంత తవ్విస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి, వంకతండా గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పే వారికే పథకాలు అమలు చేస్తున్నారని సుశీలమ్మ అనే మహిళ వాపోయింది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మరో మహిళ వాణీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జగన్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి అందరికీ మంచి జరుగుతుందని ఉషాశ్రీ చరణ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment