హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో బుధవారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోని 175 నియోజక వర్గాల్లో ఒకేసారి నిరహార దీక్షలు చేయనుంది. గాంధీ జయంతి నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ఒకటి వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సీమాంధ్రలోని 175 నియోజక వర్గాల్లో ఒకేసారి నిరహార దీక్షలు చేపట్టనున్నారు.
ఇక సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని శోభా నాగిరెడ్డి తెలిపారు.
సమైక్య పోరు వివరాలు:
అక్టోబర్ 2 నుంచి శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతరులు నిరాహార దీక్షలు చేపడతారు.
అక్టోబర్ 7న పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి ముందు ధర్నాలు నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలుపుతారు.
అక్టోబర్ 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 17న శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ.
అక్టోబర్ 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు- మానవహారాలు
అక్టోబర్ 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు
అక్టోబర్ 26న జిల్లాల్లోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష
అక్టోబర్ 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలు
నవంబర్ 1న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ- సమైక్యాంధ్రను కోరుతూ తీర్మాణం చేయనున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుపలుకుతున్నారు.