
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖాయం: మేకపాటి
సమైక్యాంధ్ర ప్రదేశ్‌లోనే ఎన్నికలను ఎదుర్కొంటామని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకొని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిర్వహించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ధర్నాలో పాల్గొన్న అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
కాంగ్రెస్‌తో ఎంపీ వైఎస్ జగన్ కుమ్మక్కయినట్టు చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ కుమ్మకై్క ఉంటే జగన్ 16 నెలలపాటు జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని వీరప్పమొయిలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా... అది ఆయన భావనని, దానికి మనమేం చేయలేమని చెప్పారు.
యూపీఏతో పొత్తు విషయమై ప్రశ్నించగా... ‘‘రానున్న ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే పార్టీ లేదు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాదు. ఫలితాలు అంతా అయోమయంగా ఉంటాయి. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి లౌకిక శక్తులతో కలిసి ముందుకువెళతాం’’ అని బదులిచ్చారు. జగన్‌ను నష్టపర్చడానికి కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగానే దిగ్విజయ్‌సింగ్ జగన్, కాంగ్రెస్ డీఎన్‌ఏ ఒక్కటేనని వ్యాఖ్యానించారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓట్లు వేయడం కోసమే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
రాజీనామాల ఆమోదం కోసం నేడు స్పీకర్‌ను కలవనున్న మేకపాటి
రాష్ట్రాన్ని విభజించకుండా, సమైక్యంగానే కొనసాగించాలన్న డిమాండ్ తో తన… పదవికి రాజీనామా సమర్పించిన… మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో సమావేశం కానున్నారు. రాజమోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. శనివారం లోక్‌సభ స్పీకర్‌ను కలసి, తమ రాజీనామాలు వెంటనే ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానని మేకపాటి తెలిపారు.