వేదికపై జెడ్పీచైర్మన్ రాఘవేంద్రరెడ్డి, చిత్రంలో మంత్రి సోమిరెడ్డి, జేసీవెట్రిసెల్వి
నెల్లూరు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. మంగళవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ప్రారంభంలో సాఫీగానే సాగింది. కరువు, తాగు, సాగునీరు, నుడాలో పంచాయతీల విలీనంపై జరుగుతున్న నష్టంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మధ్యాహ్నం పలువురు సభ్యులు సమస్యలపై నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల మధ్య మాటలు యుద్ధం జరగడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు.
డ్వామాలో అవినీతి
సభకు అధ్యక్షత వహించిన జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తొలుత వెంకటగిరి రాజా సతీమణి మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. అందరూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాలని బొమ్మిరెడ్డి కోరారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బులగాకుల అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్వామాలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కలువాయి మండలంలో జరిగిన రూ.17.56 కోట్ల పనులకు సంబందించి సోషల్ ఆడిట్ వారు రూ.11.89 కోట్లు అవినీతి జరిగిందని లెక్కలు తేల్చారన్నారు. అయితే డ్వామా అధికారులు కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే రికవరీ వేశారన్నారు. దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యుడు చీదెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ సంవత్సరం క్రితం చేసిన పనులను సైతం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడదానికి కారణం డ్వామా అధికారులేనని ఆరోపించారు. వెంకటాచలం జెడ్పీటీసీ వెంకటశేషయ్య మాట్లాడుతూ అధికారులు నాలుగు గోడల మధ్య కూర్చొని టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకు రికవరీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో సోషల్ ఆడిట్ అధికారులది తప్పా లేదా డ్వామా అధికారులది తప్పా అని ప్రశ్నించారు. దీంతో డ్వామా పీడీ బాపిరెడ్డి మాట్లాడుతూ సోషల్ ఆడిట్ అధికారులు పనిమొత్తాన్ని పరిగణనలోనికి తీసుకుంటారన్నారు. తర్వాత తాము రికార్డులు పరిశీలించి మొత్తం పనిలో ఎంతవరకు జరిగిందో చూస్తామన్నారు. అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్వామా కార్యాలయంలో ఏపీడీ నాసర్‌రెడ్డి కనుసన్నల్లో పాలన జరుగుతోందని విమర్శించారు. దీంతో మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని అదే నిజమైతే విచారణ చేసి వారంరోజుల్లోగా నాసర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాగునీటి ఎద్దడిపై ఆందోళన
కోవూరు జెడ్పీటీసీ సభ్యుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అవినీతి వల్ల సీపీడబ్ల్యూఎస్ నీటి పథకాలు సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు. దొరవారిసత్రం జెడ్పీటీసీ సభ్యురాలు విజేత మాట్లాడుతూ తమ మండలంలోని తీర ప్రాంతాల్లోని 15 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
సర్వేపల్లిలో తాగునీటి పరిస్థితి దారుణం
తన నియోజకవర్గం సర్వేపల్లిలో 63 ఆవాస ప్రాంతాలుండగా, 20 ప్రాంతాలకు మాత్రమే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. పొదలకూరు ప్రాంతంలో 14 గ్రామాల్లో, ఊచపల్లి తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సర్వేపల్లి ప్రాంతాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నామన్నారు. కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువలో నెల్లూరు డ్రెయినేజీ కలుస్తోందని ఆ నీటిని మీరు తాగగలరా అని నిలదీశారు. నియోజకవర్గానికి నీరిచ్చే ప్రత్యామ్నాయ పథకానికి గత సంవత్సరంలో రూ.80 లక్షల అంచనాలు రూపొందించారని, ఇప్పుడు ఏకంగా అంచనాలను రూ.8 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. స్పెషల్ ఆఫీసర్స్ కూడా తమకెందుకులే అని తప్పించుకుంటున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, వై.శ్రీనివాసులురెడ్డి, బీద రవిచంద్ర తదితరులు తాగునీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటి ట్యాంకర్ల రవాణాకు ఇచ్చే మొత్తాన్ని రూ.450 నుంచి 650కు పెంచాలని కోరారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు దొరికే చోట నుంచి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.
నుడాపై దుమారం
కొడవలూరు జెడ్పీటీసీ ఇందూరు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలోని 15 పంచాయతీలను నుడాలో ఎవరి అనుమతి తీసుకుని కలిపారని నిలదీశారు. గతంలో ఇంటి అనుమతికి రూ.400 చెల్లిస్తే ఇప్పుడు రూ.69 వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు. నుడా తమకు అవసరం లేదన్నారు. ఇదే అంశంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నుడా పరిధిని తీసేయాలన్నారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ దీనిపై త్వరలో నుడా, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
నీరు తెస్తాం
ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, వింజమూరు తదితర ప్రాంతాల్లోని కరువుపై ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ తాగునీటికి ప్రాధాన్యత నిస్తామన్నారు. సాగునీటికి శ్రీశైలం నీరు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సాగునీటిపై చర్చ సాగుతున్న సందర్భంలో సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి పలు అంశాలను లేవనెత్తారు. అంశాలకు అధికారులు సమాధానం చెప్పే సమయంలో మంత్రి సోమిరెడ్డి జోక్యం చేసుకోవడంతో సమావేశం అదుపుతప్పింది. ఓ దశలో విమర్శలపర్వం తీవ్రం కావడంతో అజెండాలోని ఇతర అంశాల జోలికెళ్లకుండానే చైర్మన్ రాఘవేంద్రరెడ్డి సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీషా, జేసీ వెట్రిసెల్వి, జెడ్పీ సీఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రామిరెడ్డి వర్సెస్ బీద
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చట్టం ప్రకారం కావలి కాలువకు 1,000 క్యూసెక్కుల నీరు వదలాల్సి ఉందన్నారు. అయితే 400 క్యూసెక్కులు వదిలారని దీంతో కావలి రూరల్ మండలంలో పంటలు ఎండిపోయాయని తెలిపారు. కొందరి స్వార్థం కోసం సిరిపురం చెరువు మధ్యలో 15 అడుగుల లోతున ఇరిగేషన్ అధికారులు కిలోమీటర్ పొడవున కాలువ తవ్వారంటూ ఫొటోలు ప్రదర్శించారు. కింది ప్రాంతాల్లో ఒకరి కోసమే ఇదంతా చేశారని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ తమపై అనసరంగా నిందలు వేయడం తగదన్నారు. కింది ప్రాంతాల వారికి నీళ్లిచ్చేందుకు అధికారులు తాత్కాలికంగా కాలువ తవ్వారన్నారు. 40 ఏళ్ల చరిత్రలో కావలి కాలువకు 500 నుంచి 1,000 క్యూసెక్కులు నీరిచ్చేలా అనుమతులు తెచ్చింది తామేనన్నారు. దీంతో రామిరెడ్డి మాట్లాడుతూ అధికారులు ఇందుకు సమాధానం చెప్పాలని బీదను అడగలేదన్నారు. దీంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి డెల్టా నీటిని అక్రమంగా కావలి ప్రాంతాల వారు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అమృత్ పథకంపై విచారణ జరపాలి పబ్లిక్‌హెల్త్ అధికారుల అత్యుత్సాహం ఎందుకు?
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వ నిధులతో పబ్లిక్‌హెల్త్ అధికారులు చేపట్టిన అమృత్ పథకంపై విచారణ చేపట్టాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటిపారుదల శాఖకు చెందిన కాలువలను పబ్లిక్‌హెల్త్ అధికారులు పూడికతీసి గోడలు నిర్మించి రంగులు వేస్తున్నారన్నారు. రూ.83 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఆరు కాలువలకు ఇప్పటికే రంగులు వేశారన్నారు. పనులు నాసిరకంగా జరుగుతున్నాయన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియకుండా, కనీసం మాట కూడా చెప్పకుండా టాటా కన్సెల్టెన్సీతో సర్వే చేయించుకుని పబ్లిక్‌హెల్త్ అధికారులు పనులు చేయిస్తున్నారన్నారు. సింగిల్ టెండర్ ద్వారా పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించడం సిగ్గుచేటన్నారు. దీని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అధికారులే చెప్పాలన్నారు. స్థానిక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఇక రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ‘మీకు తెలియదా’ అంటూ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. తమకు తెలియదని అధికారులు సమాధానం చెప్పారు. దీంతో మంత్రి ఇరిగేషన్ స్థలాలను ఇంకో శాఖ ఆక్రమిస్తుంటే ఇక మీరెందుకని ప్రశ్నించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని కూడా నుడా పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఇసుక దిబ్బలు తొలగించి ప్రాణాలు కాపాడాలి
ఇదే సందర్భంలో కోటంరెడ్డి మళ్లీ మాట్లాడుతూ పొట్టేపాళెం చెరువు కలుజు వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కుప్పలు, తెప్పలుగా ఇసుక దిబ్బలు ఉన్నాయన్నారు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో తాను సొంత నిధులతో ఇసుక దిబ్బలు తొలగించానన్నారు. వీటిని తొలగించి ప్రమాదాలు నివారించాలని భవిష్యత్‌లో ఇసుక దిబ్బలు పేరుకుపోకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సోమిరెడ్డిని కోరారు. దీంతో ఇసుకమేటలను తొలగించి రోడ్డును క్లియర్ చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment