నారాపై రైతుల కన్నెర
సాక్షి ప్రతినిధి, విజయనగరం :గద్దెనెక్కించిన మాఫీ నాటకం ‘రుణ’రంగంగా మారుతోంది. మీ రుణాలను తీర్చేస్తానని, మిమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కించేస్తాననీ చెప్పి ఓట్లేయించుకున్న చంద్రబాబు తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని విస్మరించి కల్లబొల్లి మాటలు, కమిటీల కబుర్లు చెప్పడంతో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, రైతులు గురువారం ఆందోళనలు చేశారు. పలుచోట్ల ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో హొరెత్తించారు. రుణాల మాఫీని వెంటనే అమ లు చేయాలని నినదించారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును నిరసి స్తూ జిల్లాలోని సాలూరు,
పార్వతీపురం, చీపురుపల్లి, కురుపాం, జియ్యమ్మవలస, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వాహనాలను నిలివేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు, డ్వాక్రా మహిళలు ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే పి రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ అధికారం కట్టబెడితే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తానన్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా రుణాలు మాఫీ చేయకుంటే రైతులపై పడే 12 శాతం వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాం మండలం కేంద్రంలో నిర్వహించిన నరకాసుర వధ-దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రుణమాఫీని రూ. లక్ష కోట్ల నుంచి రూ. 35 వేల కోట్లకు కుదించారన్నారు. డ్వాక్రా రుణాలపై కూడా స్పష్టమైన ప్రకట న చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసిన ఇప్పుడు మహిళలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
రుణాలు మొత్తం మాఫీ అని చెప్పి పరిమితులా?
రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని, అసలు ఎప్పుడు మాఫీ చేస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని కురుపాం నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు విమర్శించారు. జియ్యమ్మవల మండలంలో ని పెదమేరంగి కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా శత్రుచర్ల మాట్లాడు తూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకూ పోరాటం ఆపే ది లేదన్నారు. మూడు రోజులపాటు ఆందోళనలు చేస్తామన్నారు.
నయవంచకుడు చంద్రబాబు
ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు నయవంచకుడని చీపురుపల్లి ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం కప్పదాటుడు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. మండలంలోని జి ములగాంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మోసాన్ని రైతులకు,డ్వాక్రా మహిళలకు వివరించి వారికి అవగాహన కల్పించారు.
పార్వతీపురం ఎమ్మార్ నగర్‌లో...
చంద్రబాబు జిమ్మిక్కు లు నమ్మి ప్రజలు ఆయనకు పట్టం కట్టారని పార్వతీపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ అన్నా రు. నరకాసుర వధ కా ర్యక్రమంలో భాగంగా మండలంలోని ఎమ్మార్ నగర్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.