* జగన్‌కు బెయిల్ మంజూరుతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం
* వైఎస్‌ఆర్ సీపీ శ్రేణుల్లో ఉరిమిన ఉత్సాహం
సాక్షి నెట్‌వర్క్: పల్లె, పట్నం ఏకమయ్యాయి.. వాడవాడలు మార్మోగాయి.. ఎక్కడ చూసినా సంబరాలే.. ఎవరిని కదిపినా జగన్నినాదమే..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందన్న విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు పండుగ చేసుకున్నారు. బాణసంచా పేల్చుతూ, రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్‌లు చేస్తూ, మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.
చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దఎత్తున జనం, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. యువకులు ఆనందంతో బైక్ ర్యాలీలు తీశారు. రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ నేతలు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ జిల్లాలో అన్నిచోట్ల పండుగ వాతావరణం కనిపించింది. కడపలో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలో అనేక సెంటర్లలో కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చారు. విశాఖ జిల్లాలో పలుచోట్ల ప్రజలు దేవాలయాల్లో పూజలు చేసి, మిఠాయిలు పంచుకున్నారు. విశాఖలో విద్యార్థులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతి తుడా సర్కిల్‌లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ నేతలు టపాకాయలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
కృష్ణా జిల్లా విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ముందు నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ కార్యకర్తలు ‘ఈరోజే అచ్చమైన దీపావళి’ అంటూ బాణసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తంచేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతి నేతృత్వంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, కర్నూలు, ప్రకాశం శ్రీకాకుళం జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి.
వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్‌లో కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు సంబరాలతో హోరెత్తిపోయాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు యాదగిరిగుట్టలో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి ఏకధాటిగా 483 రోజుల పాటు కొనసాగాయి. జగన్ విడుదలయ్యేంత వరకు దీక్ష కొనసాగిస్తామని చెప్పినట్టుగానే చివరిదాకా దీక్షలు నిర్వహించారు. మంగళవారం పార్టీ జిల్లా నేతల ఆధ్వర్యంలో దీక్షలు విరమించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్‌లో పార్టీ నేతలు బాణసంచా కాల్చారు.
తమిళనాడు, కర్ణాటకలోనూ..
జగన్‌కు బెయిల్ మంజూరు కావడంతో తమిళనాడులోని చెన్నైలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తమిళనాడు విభాగం నేతలు శరత్, శరవణన్, జాకీర్‌హుస్సేన్ తదితరులు భారీ జనసందోహంతో రోడ్లపైకి చేరుకున్నారు. కర్ణాటకలో కూడా అభిమానులు హర్షం వ్యక్తంచేశారు. బెంగళూరులోని యలహంక, బొమ్మనహళ్లి, మారతహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ కత్రిగుప్పెలతో పాటు బళ్లారి, హొసూరు తదితర ప్రాంతాల్లో అభిమానులు స్వీట్లు పంచుకున్నారు.
సమైక్య భేరిలో జగన్నినాదం
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయవర్సిటీలో సోమవారం నిర్వహించిన సమైక్య భేరిలో జై.. జగన్ నినాదాలు మార్మోగాయి. సమైక్య భేరి జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి సభాస్థలి వద్దకు వచ్చి..నాంపల్లి సీబీఐ కోర్టు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిందన్న విషయం ప్రకటించగానే.. అక్కడున్న విద్యార్థులు ఒక్కసారిగా పైకి లేచి పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినదించారు. సమైక్యాంధ్ర కోసం జైల్లో కూడా జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసుకుంటూ జైజై జగన్ అని వేలాది గొంతులు నినదించడంతో వర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది.
జన ఘన సంబరం
Published Tue, Sep 24 2013 12:58 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement
Advertisement