జగనన్న వచ్చేశాడు.. 484 రోజుల నిరీక్షణ ఫలించింది.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో చంచల్‌గూడ జైలు నుంచి జననేత జగన్ విడుదలవగానే ఊరూ వాడ జగన్నినాదాలతో హోరెత్తింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం రోడ్డుపై కొచ్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు.. మిఠాయిలు పంచుకున్నారు.. నృత్యం చేశారు.
సాక్షి, అనంతపురం : జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో మంగళవారం జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. జగన్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి అడుగు బయటపెట్టగానే.. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ‘జై..జగన్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు, కేకులు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు యోగీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.
పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ఎర్రిస్వామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ టీవీ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. 45వ డివిజన్‌లో పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు.
మిఠాయిలు పంచిపెట్టారు. కళ్యాణదుర్గం రోడ్డులోని రాజా హోటల్ వద్ద జగన్ అభిమానులు దాదాపు రెండు వేల మందికి అన్నదానం చేశారు. ధర్మవరం పట్టణంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రవితేజారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి పెట్టారు. పార్టీ నాయకులు గుండా ఈశ్వరయ్య, ఓబిరెడ్డి, బొమ్మా హరి ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతీ రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించి... ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. చిలమత్తూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కదిరిలో పార్టీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, ఫర్హానాఫయాజ్, బయప్ప, లోకేశ్వర్‌రెడ్డి, చాంద్‌బాషా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మడకశిర మండలం కదిరేపల్లిలో ప్రజలు బాణాసంచా కాల్చి.. సంబరాలు జరుపుకున్నారు. అమరాపురం, నాగోనహళ్లి, తమడేపల్లిలో కేకులు కట్ చేసి, అన్నదానం చేశారు. రాప్తాడు, కనగానపల్లి, ఆత్మకూరు, రామగిరి, శింగనమల, పుట్లూరు, అగళి, గుడిబండ, ఓడీచెరువు, విడపనకల్లులో సంబరాలు మిన్నంటాయి. రొళ్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. పుట్టపర్తి, కొత్తచెరువులో వైఎస్సార్‌సీపీ నాయకుడు మాణిక్యం బాబా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. అమడగూరు చౌడేశ్వరి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పెనుకొండ, రొద్దంలో ర్యాలీ నిర్వహించి... స్వీట్లు పంచారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మున్నా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుసర్కిల్‌లో మానవహారం నిర్మించి వృద్ధులకు పండ్లు, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. తాడిపత్రి పరిధిలోని పులిపొద్దుటూరులో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దవడుగూరు శివాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి... ర్యాలీ నిర్వహించారు. యాడికిలో ర్యాలీ చేశారు. ఉరవకొండలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జగన్‌కు అంతా మంచే జరగాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెంకటాంపల్లి పెద్ద తండాలో గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ నాయకుడు ప్రణయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
ఊరూ వాడా సంబరం
Published Wed, Sep 25 2013 2:26 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement