=తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు
=‘గడపగడపకు వైఎస్సార్‌సీపీ’తో పార్టీని మరింత పటిష్టం చేయాలి
=పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
నూజివీడు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలోని 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 150 పైనే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిం చడం ఖాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పార్టీ నూజివీడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నామని, తెలంగాణలో కూడా ఊహించని విధంగా అన్ని పార్టీల కంటే మెజారిటీ స్థానాలను వైఎస్సార్‌సీపీనే గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటి నుంచి గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని మరింత పటిష్టవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
పార్టీకి కార్యకర్తలే వెన్నెముక...
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని చెప్పారు. కార్యకర్తలు పటిష్టంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు మట్టికొట్టుకుపోవడం ఖాయమన్నారు.
విభజన నష్టాలు ప్రజలకు వివరించాలి...
రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం జననేత జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారన్నారు.
పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి కమిటీలను, గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బసవా భాస్కరరావు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, లాము ప్రసాదరావు, కలగర వెంకటేశ్వరరావు, పిళ్లా చరణ్, కోటగిరి గోపాల్, మందాడ నాగేశ్వరరావు, పల్లెర్లమూడి అభినేష్, నెర్సు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్రలో 150 సీట్లలో గెలుపు ఖాయం
Published Tue, Nov 26 2013 1:30 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement