గతేడాది డిసెంబర్లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్వాగతించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది డిసెంబర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మాసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆమె న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
దీంతో ఆ ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాకేత్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.