సాక్షి, తాడేపల్లి: పేద ప్రజల సంక్షేమానికి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహానేతకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్లు, పింఛన్ వంటి పథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.
ఏపీ భవన్‌లో వైఎస్సార్ వర్ధంతి..
వైఎస్సార్‌సీపీ నేత పోతల ప్రసాద్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేతలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment