సాక్షి, కడప : రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుధ్ఘాటించారు వ్యవసామశాఖ మంత్రి కన్నబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లాలోని జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవం వేడుకలు జరపబోతున్నామని, రైతు మిషన్‌లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయంపై చేసిన అశ్రద్ధ వల్లే ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. దీనికి పరిష్కారంగా ఒరిస్సా, బరోడా, కర్నాటక నుంచి విత్తనాలను తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం దురదృష్టకరమని, తీవ్రంగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కడపలో 78.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపిన మంత్రి కన్నబాబు చీని రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment