
పండ్ల తోటల నరికివేత
సాక్షి నెట్‌వర్క్: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులతో ఆగకుండా వారి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీవారికి చెందిన ఇళ్లపై దాడులు, వ్యవసాయ పొలాలను నాశనంచేయడం, పండ్లతోటలను నరికేయడం వారికి పరిపాటిగా మారింది. మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిలాల పలాల నియోజకవర్గం మందస మండలం బుడారిసింగికి గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ సర్పంచ్ సురేష్‌కుమార్ పాణిగ్రాహి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో జూన్ 30వ తేదీ రాత్రి టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ చిదిరాల సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
దీన్ని సాకుగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హత్యాయత్నం చేశారంటూ 200మంది టీడీపీ వర్గీయులు మర్నాడు దాడులకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీటీసీ మొరవినేని భాస్కరరావుపై మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వారి ఇంటి లోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని రాపూరు మండలం తెగచెర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొడ్డు మధుసూధన్ రెడ్డికి చెందిన కారును తగులబెట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పొలాలకు ఉన్న కంచెను కూడా తగులబెట్టారు.
అనంతపురం జిల్లా కనగానపల్లిలో హరిజన సుబ్బరాయుడు పొలంలో మే 18వ తేదీన 350 మామిడి చెట్లను నరికివేశారు. అలాగే శింగనమల నియోజకవర్గం యల్లనూరులో 86 చీనీ చెట్లు, పెద్దమల్లేపల్లిలో 100 చీనీచెట్లను నరికివేశార.ు. చిత్తూరుజిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.