సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రెండోరోజు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల జాతీయ రహదారులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దగ్గరుండి మూయించారు. ముం దు జాగ్రత్త చర్యగా ఆర్‌టీసీ సర్వీసులను డిపోల నుంచి కదలనీయలేదు. బంద్ సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు ముఖ్య పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి సహా మేరిగ మురళీధర్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కూడలిలో గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని రామలింగాపురం, హరనాథపురం, వీఆర్‌సి సెంటర్, మద్రాసు బస్టాండ్, ఆర్‌టీసీ, కేవీఆర్ పెట్రోలు బంక్, దర్గామిట్ట, వేదాయపాళెం, బీవీనగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ జరిగింది.
ఆత్మకూరు మండలం నెల్లూరు పాళెం వద్ద నెల్లూరు- ముంబయి రహదారిపై సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దూరుపాడు జాతీయ రహదారిని వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర కోసం పట్టణంలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్‌లు గూడూరులో బంద్‌ను పర్యవేక్షించారు. పోటుపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో రెండో రోజు శనివారం రాస్తారొకో నిర్వహించారు. మండల కన్వీనర్ పచ్చిపాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు.వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన బంద్‌ను సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పర్యవేక్షించారు. అనంతరం బాలాయపల్లి మండలంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి హాజరయ్యారు. తడలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో బంద్ పాటించారు.
విభజన జ్వాల
Published Sun, Dec 8 2013 5:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement