గిద్దలూరు పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ యువత
ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. వివిధ వర్గాల ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలు బంద్‌కు సంఘీభావం తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. బంద్‌పై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బంద్ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బంద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టనున్న బంద్‌లో బాలినేని పాల్గొననున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జిల్లాలో సంపూర్ణంగా బంద్ చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బాలినేని ఇప్పటికే పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని బంద్ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ హోదాను తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద సాగిలపడిన విషయాన్ని క్షేత్ర స్థాయిలో వివరించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ద్వంద్ధ వైఖరి వల్లే రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ప్రజలకు తెలియజెప్పనున్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, హోదా కోసం వైఎస్సార్ సీపీ చివరి వరకూ పోరాడుతుందని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. బంద్‌కు ఉద్యోగ, కార్మిక సంఘాలతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు కూడగట్టారు.
ఆది నుంచి హోదా పోరు
ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పెట్టుబడి రాయితీలు లభిస్తాయని, తద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి యువభేరీలు, సభలు, సమావేశాలు నిర్వహించి హోదాతో కలిగే ప్రయోజనాలకు విద్యార్థులు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకు వివరించారు. హోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయినా స్పందించకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. జిల్లా నుంచి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడైన వైవీ సుబ్బారెడ్డి తన పదవిని వదులకున్నారు.
ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్ రూపంలో వస్తాయి. మిగిలిన పది శాతం నిధులు మాత్రమే లోన్‌గా ఇస్తారు. ప్రధానంగా ఇన్‌కం ట్యాక్స్‌లో రాయితీ ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. హోదా వస్తే ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, మార్కాపురం పలకల పరిశ్రమలు మరింత విస్తరించి వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పొగాకు కాబట్టి సిగరెట్ కంపెనీలు జిల్లాకు తరలిస్తాయి. సుబాబుల్, జామాయిల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నందున పేపర్ పరిశ్రమ నెలకొల్పేందుకు అనుకూలంగా ఉంటుంది.
గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో రైతులు టమోటా, కనిగిరి ప్రాంతంలో బత్తాయి, నిమ్మ అత్యధికంగా పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశంలో జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న ప్రతిపాదన సాకారమయ్యే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టుతోపాటు కోస్తా కారిడార్‌లో భాగంగా తీరప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జ్ ఓ కొలిక్కి వస్తాయి. ఒంగోలు నాన్‌మెట్రో విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చరల్ యూనివర్సిటీ, మినరల్ యూనివర్సిటీ మన దరికొస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment