గవర్నర్ పాలన దురదృష్టకరం: మైసూరా | ysrcp blames congress for president rule in andhra pradesh | Sakshi
Sakshi News home page

గవర్నర్ పాలన దురదృష్టకరం: మైసూరా

Published Sat, Mar 1 2014 1:40 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

గవర్నర్ పాలన  దురదృష్టకరం: మైసూరా - Sakshi

గవర్నర్ పాలన దురదృష్టకరం: మైసూరా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన సాగించలేక ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి చేతులెత్తేసి గవర్నర్ పాలనకు సిఫార్సు చేయడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లోనూ కేంద్రంలోనూ సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయండంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్ర పురోభివృద్ధిని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి, చివరికి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దారుణమన్నారు. ‘‘నాలుగున్నరేళ్లుగా టీడీపీ మద్దతు, కుమ్మక్కు వల్లే కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది. లేకపోతే ఎప్పుడో కూలిపోయేది. పడవ మునిగేటప్పుడు ప్రాణరక్షణ కోసం పరుగులు తీసినట్టు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మునిగిపోతుండటంతో ఇతర పార్టీల్లోకి పరుగులు తీస్తున్నారు. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వారం రోజులుగా అనేక డ్రామాలాడారు.

 

ఫలానా వ్యక్తి సీఎం అంటూ లీకులిచ్చారు. కానీ ఎవరూ నిలబడలేకపోవడంతో కాంగ్రెస్ పలాయనమంత్రం పఠించింది. గవర్నర్ పాలనకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ కర్ణాటకకు చెందిన ఒక పెద్దమనిషిని రెండుసార్లు రాజ్యసభకు పం పిస్తే, ఆ వ్యక్తే 3 ప్రాంతాల్లోని తెలుగు ప్రజలమధ్య చిచ్చు పెట్టారని కేంద్రమంత్రి జైరాం రమేశ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
 కేంద్రం ప్రకటనలకు విలువుండదు: మూడు నెలల తర్వాత దేశంలో నామరూపాల్లేకుండా పోయే పార్టీ చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుం దని మైసూరా ప్రశ్నించారు. తుమ్మితే ఊడిపోయే ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటనలకు విలువే లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత సోనియా, రాహుల్‌లు పెట్టె సర్దుకుని ఇటలీకి వెళ్లాల్సిందేనన్నారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 60కి మించి లోక్‌సభ సీట్లొచ్చే పరిస్థితే లేదని లోకం కోడై కూస్తోంది. కానీ మతిభ్రమించిన చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ పట్ల పిచ్చిపిచ్చిగా అవాకులు పేలుతున్నారు. దేశంలో బిచాణా ఎత్తేసి కనుమరుగయ్యే కాంగ్రెస్‌తో మేమెందుకు జతకడతాం? తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన వారితో ఎట్టి పరిస్థితిలోనూ కలిసే ప్రసక్తే లేదు. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుంది’’ అని చెప్పారు.
 
 ఆ పత్రిక రాతలు తెలుగు ప్రజలందరికీ తెలుసు: ఆపద్ధర్మ మంత్రి టీజీ వెంకటేశ్‌తో ఇప్పటిదాకా తాను ఏ ఒక్కరోజు కూడా నేరుగాగానీ, ఫోన్‌లో గానీ మాట్లాడిన దాఖలాలు లేవని మైసూరా స్పష్టంచేశారు. టీజీని టీవీల్లో తప్పితే ఇప్పటిదాకా నేరుగా కూడా చూడలేదన్నారు. టీజీని వైఎస్సార్‌సీపీలోకి రావాలని తాను కోరినట్టుగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని విలేకరులు ప్రస్తావించగా మైసూరా ఇలా స్పందించారు. తమ పార్టీపై, తమ అధినేత జగన్‌పై ఆ పత్రిక ఏం రాస్తుందో, ఎలా రాస్తుందో, ఎందుకలా రాస్తుందో తెలుగు ప్రజానీకానికి తెలుసనన్నారు. వైఎస్సార్‌సీపీలో స్థానం దొరకని, అవకాశంలేనివారే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement