సార్వత్రిక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. 36 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లాలో రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచార పర్వం నిర్వహించగా, జాతీయ పార్టీల నేతలు జిల్లాకు రాకుండా ముఖం చాటేశారు. మరో వైపు 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు బిజీగా ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన, స్వత్రంత అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగియనుండడంతో, ఆఖరుగా 36 గంటలు ఉండగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అధికార తెలుగుదేశం పార్టీ జిల్లాలో ధన ప్రవాహాన్ని పారిస్తోంది. గత నెల 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఈ నెల 11వ తేదీన పోలింగ్, వచ్చే నెల 23వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. వచ్చే నెల 23 వరకు అధికారికంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజు నుంచి జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. దీని కొనసాగింపుగా 9వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లాలో సెక్షన్ 144 పక్కాగా అమలులోకి రానుంది.
జగన్ సభలతో నూతనోత్తేజం
జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని కావలి, గూడూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి పార్టీ క్యాడర్‌లో నయా జోష్ నింపారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ప్రధాన సమస్యలపై సమగ్ర అవగాహనతో మాట్లాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు. పార్టీ నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగే లబ్ధిని వివరించారు. గత నెల 21న కావలిలో, 31న గూడూరు, ఈ నెల 4న నెల్లూరు సిటీలో ఎన్నికల సభలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 7న సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎన్నికల సభలో పాల్గొన్నారు.
జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆమె విజ్ఞప్తి చేశారు. పది నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. దాదాపు ఆరు నెలలుగా ‘రావాలి జగన్––కావాలి జగన్’ పేరుతో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ప్రజలకు దగ్గరయ్యారు. ఒక్క అవకాశం ఇస్తే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పర్వాన్ని విజయవంతంగా ముగించుకుని ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యారు.
వ్యక్తిగత విమర్శలతో బాబు హడావుడి
మరో వైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఎన్నికల సభలు నిర్వహించారు. అయితే ప్రతి సభలో చేసింది చెప్పుకోలేని పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, స్థానిక అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరి నిమిషం వరకు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు దొరక్క ఆఖరిలో అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై సృష్టత రాలేకపోయారు. నామినేషన్ల ఘట్టం వరకూ విడతల వారీగా చివరి వరకు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వచ్చారు. ఈ పరిణమాలతో జిల్లాలో పార్టీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో ప్రచారంలో అభ్యర్థులు వెనుకబడిపోయారు.
ప్రలోభాలపైనే వారు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నిర్వహించిన సభలకు జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడం, ఆయన ప్రసంగం గందరగోళంగా సాగింది. దీంతో క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ప్రస్తుతం వారు ధన ప్రవాహంపై దృష్టి సారించారు. జిల్లాలో పోలీసులు చేస్తున్న దాడుల్లో అధికార పార్టీకి చెందిన నగదు, మద్యం లభించడమే ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత పేలవంగా సాగింది. ముఖ్యంగా నెల్లూరు సిటీ, కోవూరు, కావలిలో సభలు జనంలేక వెలవెలబోయాయి. భారతీయ జనాతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జిల్లా ముఖం చూడకపోవడం గమనార్హం.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంకాలం 6.00 గంటలతో ముగిసిన తర్వాత ప్రచారం చేసే వారిపై ఎన్నికల సంఘం కేసులు నమోదు చేయనుంది. దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖిల్లో రూ 31253510లు నగదు పట్టుకున్నారు. రూ 18272765ల విలువ చేసే మ«ధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ 17143577ల విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు పాటించని 142 మందిపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment