సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజా సంకల్పం సిద్ధించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు హోరెత్తాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు «శనివారం జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు, దేవాలయాలు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ నెల ఆరు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు కొయ్యలగూడెం నుంచి మద్ది పుణ్యక్షేత్రానికి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. కొయ్యలగూడెంలోని గణేష్ సెంటర్‌లో పూజలు నిర్వహించి అక్కడి నుంచి బయ్యనగూడెం, సీతంపేట, నరసన్నపాలెం, వై.జంక్షన్‌ల మీదుగా మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భీమడోలు జంక్షన్ నుంచి ద్వారకాతిరుమల వరకు 15 కిలోమీటర్ల మేర కాలినడకన పాదయాత్ర సాగింది.
భీమడోలు జంక్షన్‌లోని రూపక దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించిన అనంతరం పొలసానిపల్లి, ఆంజనేయనగర్, పంగిడిగూడెం మీదుగా యాత్ర ద్వారకాతిరుమల చేరుకుంది. గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ తలారి వెంకట్రావు, జిల్లా నాయకులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు, తల్లాడ సత్తిపండులు జంగారెడ్డిగూడెం నుంచి మద్ది ఆంజనేయ స్వామి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. భీమవరం పట్టణంలోని చినవెంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎన్నారై విభాగం నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్ మావుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరవాసరం వైఎస్సార్ సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం చేయాలంటూ నందమూరు ఆంజనేయస్వామి గుడి, వీరవాసరం చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
ఎంపీపీ కవురు శ్రీనివాస్, జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్‌కుమార్, మండల కన్వీనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భీమవరం మండలం శక్తీశ్వరస్వామి ఆలయంలో మండల పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీఎన్‌ఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో కాళ్లకూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. పాలకొల్లు పెదగోపురంలో నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలతో కలసి శనివారం పెదవేగి మండలం రాట్నాలకుంటలో పూజలు, పాదయాత్ర నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో వైసీపీ యువజన నాయకులు పెదిరెడ్ల రమేష్ ఆధ్వర్యంలో సీతారాంపేటలోని క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రార్థనలు నిర్వహించారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లి శనీశ్వరుని ఆలయంలో పార్టీ నేతలు పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment