
'బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, కె.శ్రీనివాసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
ఈ క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసుతో టీడీపీని భ్రష్టు పట్టించి రాష్ట్రం పరువు తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కర్నూలు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలతో టీడీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 80 మంది ఓటర్లు అధికంగా ఉన్నా.. అక్రమంగా గెలవాలనే టీడీపీ కర్నూలు జిల్లాలో పోటీ చేస్తోందని మండిపడ్డారు.
పోలీసులను, రెవెన్యూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి, డోన్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరించి వేలి ముద్రలను వేయించి ఓట్లు వేయించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.