సమావేశంలో మాట్లాడుతున్న కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, చిత్రంలో కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, వేణు, మార్గాని భరత్ తదితరులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉత్తమమైన మానిఫెస్టో రూపకల్పన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులను నియమించారని, దీనిలో జిల్లా నుంచి తనతోపాటు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సభ్యులుగా వ్యవహరిస్టున్నట్టు చెప్పారు. జిల్లాలోని పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు, వివిధ అనుబంధ సంఘ నాయకులను అభిప్రాయాలు సేకరించామన్నారు. 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 650పైగా అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుతం అమలు చేసే హామీలను మాత్రమే వైఎస్సార్ సీపీ రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఈ మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వారికే ఖర్చు చేయాలని చట్టం చేసినా, ప్రస్తుతం రూ.2500 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్ నిధులు పసుపు, కుంకుమ పథకానికి దారి మళ్లించారన్నారు. పార్టీ మేనిఫెస్టోలో మాత్రమే సబ్‌ప్లాన్ నిధులు వారికే ఖర్చు చేస్తామన్నారు.
తప్పుడు కేసులు పెడితే సహించం
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లను లక్ష్యంగా చేసుకొని వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తే సహించేది లేదని కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు టీడీపీ నాయకులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి టెక్నాలజీ దుర్వినియోగం చేసి వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫారం– 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారని కేసులు నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని, తమ పార్టీ బూత్ కన్వీనర్లు ఓట్లు తొలగించాలని ఎందుకు దరఖాస్తులు చేస్తారని ప్రశ్నించారు. కాకినాడ సిటీ, రంపచోడవరం నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్లు ఫిర్యాదు చేశారని వారిపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలోని బూత్ కమిటీ కన్వీనర్లు ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగింపునకు ఎలా దరఖాస్తు చేస్తారన్నారు.
ఇది కేవలం అమరావతి కేంద్రంగా టీడీపీ ఆడిస్తున్న డ్రా అన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని జిల్లాలోని కొందరు అధికారులు పార్టీ నాయకులు, సానుభూతిపరులపై రౌడీషీట్లు, బైండోవర్ నమోదు చేసి, పోలింగ్ రోజున వారిని అరెస్ట్ చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఒక ప్రైవేటు సంస్థకు రాష్ట్రంలోని 3.70 కోట్ల మంది డేటా, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఎలా చేరాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు కంటే ప్రస్తుతం డేటా గ్రిడ్ సంస్థపై కేసుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిశామని, త్వరలో జిల్లా ఎస్పీ విశాల్‌గున్నిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గ అధ్యక్షుడు మార్గాని భరత్, కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, దవులూరి దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ వివిధ అనుబంధసంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment