ఎందుకీ నాటకాలు? | YSRCP Leader Ambati Rambabu fires on CM Kiran Kumar Reddy on state bifurcation | Sakshi
Sakshi News home page

ఎందుకీ నాటకాలు?

Published Mon, Oct 21 2013 2:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఎందుకీ నాటకాలు? - Sakshi

ఎందుకీ నాటకాలు?

రాష్ట్ర విభజన తుపానును ఆపడానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వన్నీ వట్టి ఉత్తరకుమార ప్రగల్భాలేనన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో అంతర్భాగంగానే కిరణ్ వ్యవహరిస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు.
 
 సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడిన సీఎం, ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివారం ‘సాక్షి’తో రాంబాబు దుయ్యబట్టారు. ‘‘సోనియాగాంధీకి కోవర్టులాగా వ్యవహరించి, రాష్ట్ర విభజనను వేగవంతంచేసేలా ప్రయత్నిస్తున్నది నువ్వు కాదా? ‘విభజన విషయంలో నా చేతిలో ఏమీ లేదు’ అని ఎన్జీవోల నేతలతో నువ్వు స్వయంగా అనలేదా? సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ఉద్యోగులు ఉవ్వెత్తున ఉద్యమిస్తే వారి సమ్మెను నయానా భయానా విరమింపజేసింది నువ్వు కాదా? నువ్వు చేస్తున్నవన్నీ విభజనకు అనుకూల చర్యలే కాదా? ఇలా రోజుకో రకంగా మాట్లాడటం ఎవరిని మభ్యపెట్టేందుకు? ఎవరిని మోసగించేందుకు ఈ నాటకాలన్నీ? నీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఎందుకిలా ఆటలాడుతున్నావు? విభజన ప్రకటన వచ్చిన వెంటనే నువ్వు రాజీనామా చేసి ఉంటే లక్షలాది మంది ఉద్యోగులు, కోట్లాది మంది ప్రజలు నడిబజారుకు వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితే దాపురించి ఉండేది కాదు కదా!’’ అని కిరణ్‌ను ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తామని జూలై 30న సీడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి అంతకు ముందే రోడ్‌మ్యాప్‌లని, వార్ రూమ్ భేటీలని కాంగ్రెస్ అగ్రనేతలు కిరణ్‌ను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అనేక మార్లు ఢిల్లీకి పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జూలై 30వ తేదీ సాయంత్రం విభజన ప్రకటన చేయబోతున్నారని కూడా వాళ్లిద్దరికీ కచ్చితంగా ముందే తెలుసు. అలాంటప్పుడు, విభజన ప్రకటన వస్తే రాజీనామా చేస్తానని ముందుగానే సోనియాకు కిరణ్ చెప్పి ఉంటే సీడబ్ల్యూసీ ఆ ప్రకటన చేసి ఉండేదా? విభజన ఆగి ఉండేది కాదా?’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘ఇలాంటి అంశంపై ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలోనూ, కాంగ్రెస్ అధిష్టానంలోనూ తీవ్రమైన చర్చకు దారి తీసి ఉండేది. 
 
 కచ్చితంగా ఆ రోజు సీడబ్ల్యూసీ విభజన ప్రకటన చేయకుండా వెనక్కి తగ్గి ఉండేది. కానీ అప్పుడలా చేయని కిరణ్, ఇప్పుడు మాత్రం తన పదవిని తృణప్రాయంగా త్యాగం చేస్తానని, తనకు సమైక్య రాష్ట్రం కన్నా పదవి ముఖ్యం కాదని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. శ్రీకాకుళంలో తుపాను బాధితుల పరామర్శకు వె ళ్లి, ‘తుపానును ఆపలేక పోయాం గానీ, రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నం చేస్తా’నని గొప్పలు చెబుతున్నాడు. సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన ప్రకటనను వెల్లడించగానే కిమ్మనకుండా మౌనం దాల్చిన కిరణ్, సీమాంధ్రలో చెలరేగిన ప్రజాగ్రహాన్ని చూసి బయటకు వచ్చి విభజనకు తాను వ్యతిరేకమన్నట్టుగా మాట్లాడారు. ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే విభజన నోట్ కేబినెట్‌కు కూడా వచ్చింది. కేంద్ర మంత్రుల బృందం కూడా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది’’ అని ఆయన విమర్శించారు. సీఎం ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రగల్భాలు మాని, అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మా నం చేయడం ద్వారా విభజనను అడ్డుకునేందుకు నిజమైన ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement