లష్కర్‌బాబు.. జిల్లాకు చేసిందేమిటి? | YSRCP Leader B.Y.Ramaiah fire on Chandrababu | Sakshi
Sakshi News home page

లష్కర్‌బాబు.. జిల్లాకు చేసిందేమిటి?

Published Sun, Jan 7 2018 1:57 PM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

YSRCP Leader B.Y.Ramaiah fire on Chandrababu - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చేసిన మేలు ఏమీ లేదని.. 2014 ఆగస్టులో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి     జలయజ్ఞంలో భాగంగా పలు ప్రాజెక్టులను  ప్రారంభించి దాదాపు 80–85 శాతం వరకు పూర్తి చేశారన్నారు. మిగతా పనులను తూతూ మంత్రంగా చేపట్టి వాటి గేట్లు ఎత్తుతూ సీఎం చంద్రబాబునాయుడు పెద్ద లష్కర్‌గా మారారని విమర్శించారు.  శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే ఐజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  ప్రాజెక్టుల ప్రారంభ సభల్లో వైఎస్‌ఆర్‌ పేరు ఎత్తకూడదనే ముచ్చుమర్రిలో ఎమ్మెల్యే ఐజయ్య, పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డిల నుంచి మైక్‌లు లాక్కున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్‌ కట్‌ చేయించి దుశ్శాసన పర్వానికి ..బహిరంగ సభల్లో మాట్లాడితే రౌడీల ద్వారా మైక్‌ లాక్కోని రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు.   గతంలో ముచ్చుమర్రి సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిడుతుంటే సీఎం ఆనందించడం వికృత  ధోరణికి నిదర్శనమన్నారు.  సిద్ధాపురం, ముచ్చుమర్రి పథకాలు  ముమ్మాటికీ వైఎస్‌ఆర్‌ చలువతోనే ప్రారంభమయ్యాయన్నారు.   

గుండ్రేవుల ప్రాజెక్టు మరిచావా ?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని ఒక్క పెండింగ్‌ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోగా రాయలసీమకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై నోరు మెదపడం లేదన్నారు.  పక్క రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న సాకుతో కనీసం సర్వే పనులు చేపట్టలేదన్నారు. జన్మభూమిలో సమస్యలకు పరిష్కారం లభించడం లేదని చాలామంది ప్రజలు  వెళ్లడం లేదన్నారు. కొందరు  ఏదో ఆశతో వెళితే టీడీపీ నాయకుల అధికార దాహానికి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో లక్ష ఇళ్లను కట్టించలేని ప్రభుత్వం..ఏడాదిలో 19 లక్షల ఇళ్లను ఎలా కట్టిస్తుందని ప్రశ్నించారు.  రాష్ట్రంలోని పడమటి ప్రాంతాన్ని సీఎంపట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తే స్వయంగా   చెప్పడం దేనికి నిదర్శనమన్నారు.

టీడీపీకి ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు – ఎమ్మెల్యే ఐజయ్య
2014 ఎన్నికల్లో  చంద్రబాబుకు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఆయన వ్యవహార తీరుతో సిగ్గుపడుతున్నారని ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు ఎత్తకూడదని ముచ్చుమర్రి సభలో  తన మైక్‌  , పులివెందులలో  ఎంపీ వైఎస్‌ అవినాస్‌రెడ్డి మైక్‌ లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేయించినందుకు  సీఎం  సిగ్గుపడాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దళితులను కించపర్చుతుందని, రాష్ట్రపతి కోవిందు కుటుంబాన్ని అనుమతి లేని బోటులో విజయవాడ కృష్ణాబ్యారేజ్‌లో ఎలా విహారానికి తీసుకెళ్తుందని ప్రశ్నించారు. కేంద్ర, ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్‌ ఇస్తున్న ఇన్నోవా కార్లపై సీఎం బొమ్మను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు.  రైతు రథం పేరుతో  ట్రాక్టర్లన్నీ టీడీపీ వారికే ఇచ్చారని, ఇందులోఅర్హులు ఒక్కరూ లేరన్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌ మద్దయ్య, సత్యంయాదవ్, కర్నాటి పుల్లారెడ్డి, ధనుంజయాచారి, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, విజయకుమారి, పర్ల శ్రీధర్‌రెడ్డి, రమణ, భాస్కరరెడ్డి, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement