సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల ప్రక్రియనే చంద్రబాబు నాయుడు సవాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకిృష్ణ ద్వివేదీకి శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఎన్నికల తాయిలాలపై చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించినట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రకారం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి.. ఎన్నికల వేళ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా చంద్రబాబుకి లెక్కలేదని, పథకాల పేరుతో ఆయన తరఫున డబ్బులు పంచుతానని ప్రకటించడం బరితెగింపుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నిజస్వరూపం విశాఖ సభలో బయటపడిందని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని పార్టీ ధనంగా వాడుకొంటున్నారని, ఆయనది రాచరిక పాలన అని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను అందాలంటే టీడీపీకి ఓటు వేయ్యాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం ధర్మబద్ధంగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా జరిపించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment