గుత్తిలో బాణసంచా కాలుస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు (ఇన్‌సెట్) మాట్లాడుతున్న పెద్దారెడ్డి
గుత్తి: తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏడీజే కమలాదేవి గురువారం బెయిల్ మంజూరు చేశారు. తిమ్మంపల్లిలో గత నెల 28న వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలకు పెద్దారెడ్డి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 29న యల్లనూరు పోలీసులు ఆయనను అరెస్టు చేసి మరుసటి రోజు గుత్తి ఏడీజే కోర్టులో హాజరుపరిచారు. ఏడీజే 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం భక్తులకు, జేసీ దివాకర్‌రెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయని పెద్దారెడ్డిని విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని పోలీసు ఉన్నతాధికారులు అభ్యంతరం తెలుపడంతో పెద్దారెడ్డికి బెయిల్ రావడం ఆలస్యమైంది. గురువారం బెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలతోపాటు జిల్లావ్యాప్తంగా వందలాది మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుత్తి సబ్ జైలుకు తరలివచ్చారు. పెద్దారెడ్డి సబ్‌జైలు నుంచి బయటకు రాగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం ఆయన భారీ కాన్వాయ్‌తో తిమ్మంపల్లికి బయలుదేరి వెళ్లారు. పెద్దారెడ్డిని కలిసిన వారిలో పెద్దవడుగూరు సింగిల్‌విండో ప్రెసిడెంట్ గోవర్దన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గూడూరు సూర్యనారాయణరెడ్డి, జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు వెంకటస్వామిగౌడ్, శేషారెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, శరబారెడ్డి తదితరులు ఉన్నారు.
జేసీ బ్రదర్స్ ఆటలు ఇక సాగవు: పెద్దారెడ్డి
జేసీ సోదరుల అరాచకాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయని, వారి ఆటలు ఇక సాగవని తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గుత్తి సబ్‌జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలైన ఆయన భారీ కాన్వాయ్‌తో గాంధీచౌక్ వద్దకెళ్లి అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జేసీ సోదరులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటికి భయపడబోమని అన్నారు. రాబోయేది జగన్ రాజ్యమన్నారు. పోలీసులు జేసీ ఇంట్లో పని మనుషుల్లా తయ్యారయ్యారని ఘాటుగా విమర్శించారు. జేసీ సోదరులు తాడిపత్రిని మరో బీహార్‌లా మార్చాలనుకుంటున్నారని, వారికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment