’అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?’
నంద్యాల: మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ ఎస్పీవౌ రెడ్డిని, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి వరకు నంద్యాల గురించి పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు ఎన్నికలు అని చెప్పాక నంద్యాల అభివృద్ధి అని జపం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్ సీఎం కావాలన్న అఖిలప్రియ ఏడాది తిరక్కుండానే మారారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌పార్టీలో గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియ ఏ మొహంతో ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు కోరుతున్నారని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్ సీఎం కావాలంటే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి గెలిపించాలని అన్నారు. అందరం సైనికుల్లా పనిచేసి శిల్పాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.