వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు ఇప్పిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు.
రాప్తాడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు ఇప్పిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు.
మంగళవారం స్థానిక బీసీ కాలనీ నాగులకట్ట దగ్గర పార్టీ మండలస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మండల కన్వీనర్ ప్రసన్నాయపల్లి భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో కలిసి శంకరనారాయణ మాట్లాడారు.
పేరూరు డ్యాంకు నీళ్లివ్వటమే కాకుండా 49 చెరువులకు నీటిని నింపి.. నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీటినందించి సస్యశ్యామలం చేయిస్తామన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజావంచక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయ సమాధి కట్టేలా ఓటర్లలో చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో ‘ఇంటిటా టీడీపీ’ పేరుతో గ్రామాల్లో తిరుగుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బూత్, గ్రామ పంచాయతీ, మండల స్థాయి కమిటీల ద్వారా వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గ్రామాల్లో 18 ఎళ్లు నిడిన వారిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలన్నా.. సువర్ణయుగం తిరిగి రావాలన్నా వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు బోరంపల్లి ఆంజనేయులు, పార్టీ జిల్లా నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, స్థానిక నాయకులు ముకుందనాయుడు, పసుపుల నరసింహగౌడ్, దండు రామాంజనేయులు, బండి పరుశ్‌రాం, ఉషారాణీ, గంగలకుంట మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.