'జిల్లాలో పర్యటించకుండా కావూరిని మహిళలు తరిమి కొట్టాలి'
'జిల్లాలో పర్యటించకుండా కావూరిని మహిళలు తరిమి కొట్టాలి'
Published Wed, Dec 18 2013 10:06 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
మహిళలపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు దగ్గరుండి దాడులు చేయించడం సిగ్గుచేటు అని వైఎస్‌ఆర్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల వ్యాఖ్యానించారు. జిల్లాలో అడుగుపెట్టనీయకుండా కావూరిని మహిళలు తరిమి కొట్టాలి అని ఉమాబాల అన్నారు.
కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పర్యటించేందుకు వచ్చిన కావూరిని నియోజకవర్గ వైసీపీ నమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు.
‘సీమాంధ్ర ద్రోహి.. కావూరి గో బ్యాక్’ అని రాసిన ఫ్లెక్సీలను చేతబూని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలిన సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు కావూరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. కావూరి నిలదీసిన మహిళలపై దాడులకు పాల్పడటం వివాదంగా మారింది.
కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు- చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కావూరి ఒత్తిళ్లకు లొంగి పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. రాజేష్ అరెస్ట్‌ను గూడూరి ఉమాబాల ఖండించారు.
Advertisement