కాంట్రాక్ట్ ఉద్యోగుల గొంతు కోశారు: వెల్లంపల్లి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు... కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై అందరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కొన్ని పత్రికలు ఉద్యోగులకు తీపి కబురని రాయడం బాధకరమన్నారు. 2012లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చంద్రబాబు అన్నారనే విషయాన్ని వెల్లంపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారని ఆయన అన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. విశాఖలో రైల్వేజోన్ కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, నిరుద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు లోను కావద్దని ఆయన సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని వెల్లంపల్లి పేర్కొన్నారు.
కాగా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది.