'ఆ ఎంపీటీసీ సభ్యులు ఎక్కడున్నారో చెప్పాలి'
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లారు. సీఈఓ భన్వర్లాల్ను కలిసి.. ఓటుకు రూ. 3 లక్షల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. 30 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులకు డబ్బులిచ్చి వాళ్లను శిబిరానికి తరలించారన్నారు. నెల్లూరులో వాళ్లను తాము పట్టుకున్నా, పోలీసులు మళ్లీ వారిని టీడీపీ నేతలకు అప్పగించారని తెలిపారు.
ఈ అంశంపై తాము ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తక్షణమే ఆ 30 మంది ఎంపీటీసీ సభ్యులు ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తమకు రూ. 50 వేలు అడ్వాన్సు ఇచ్చినట్లు మీడియా సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యుడు చెప్పారని అన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తాము కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భన్వర్లాల్ను కలిసినవారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్, గొట్టిపాటి రవి, డేవిడ్ రాజు, చిన వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.