జీజీహెచ్ ఎదుట నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే ముస్తఫా, ఈ నెల 7న సెల్ లైటింగ్‌తో ఆపరేషన్ చేస్తున్న వైద్యులు
జీజీహెచ్‌లో ఏ వార్డును పలకరించినా గొంతు పెగలని రోగుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఏ ఆపరేషన్ థియేటర్ వైపు కన్నెత్తి చూసినా అధికారుల నిర్లక్ష్యపు ఛాయలు పేదలపాలిట శాపాలవుతున్నాయి. ఏ ఆఫీసు గది గడప తొక్కినా అభాగ్యుల బతుకులతో ఆటలాడుతున్న రాజకీయ క్రీడలు అందలమెక్కి వెక్కిరిస్తున్నాయి. సెల్‌ఫోన్ లైటింగ్‌తో ఆపరేషన్లు చేసే స్థాయికి ఆస్పత్రి పరువును దిగజార్చిన పాలకులు, అధికారుల రాతి గుండెలను కళ్లకు కడుతున్నాయి. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి, ఎలుకల దాడికి బలైన పసికందు, గైనకాలజీ వైద్యుల అలసత్వానికి తనువు చాలించిన బాలుడి ఆత్మలు.. ఇది ఖర్మాస్పత్రేనంటూ నిత్యం ఘోషిస్తున్నాయి.
సాక్షి, గుంటూరు: రోడ్లపై అరటికాయలు అమ్మే తోపుడు బండ్లపై సైతం మంచి టార్చిలైట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో మాత్రం ఆపరేషన్ థియేటర్‌లలోనే లైట్లు ఉండవు. సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఆపరేషన్ అత్యవసరమైనా రోజుల తరబడి పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ మొట్టికాయలు వేస్తూనే ఉంది. వసతులలేమి, వైద్య పరికరాల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం, కీలక పోస్టుల్లో అర్హత లేనివారిని కూర్చోబెట్టడం వంటి వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఎంసీఐ బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ డ్రామా సెట్టింగ్‌లు వేస్తూ, అధికారులను మారుస్తూ జీజీహెచ్ వైద్యులు పబ్బం గడుపుతున్నారు.
♦ జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటానని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. తనకు మాదిరిగానే పేదలకు సేవలందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తీరా ఆపరేషన్ సమయానికి కార్పొరేట్ వైద్యశాలల నుంచి పరికరాలు, వైద్యులను తెప్పించి ఆపరేషన్ చేయించారు. ఈ ఘటనలో తమపై నమ్మకం లేక బయట నుంచి పిలిపించుకొని జీజీహెచ్ పరువును తీశారంటూ ప్రభుత్వ వైద్యులు మండి పడ్డారు.
♦ గతంలో పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై పడుకున్న పసికందును ఎలుకలు కరిచి చంపేస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా ఈ దుర్ఘటన తీవ్ర సంచలనం కలిగించడంతోపాటు జీజీహెచ్ చరిత్రను మసకబార్చింది. అప్పట్లో హడావుడి చేసిన పాలకులు, ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు.
♦ ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పట్లో 10 రోజులపాటు వైద్య విద్యార్థులు విధులకు హాజరు కాకుండా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. బతికి ఉన్న శిశువును చనిపోయినట్లుగా నిర్ధారించి ఆసుపత్రి నుంచి పంపివేయడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ఈ ఘటనలో శిశువు బంధువులు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించే వరకు వెళ్లింది. అయితే శిశువును ఐసీయూలో చేర్పించిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందింది.
♦ తలకు తీవ్రగాయాలైన వెంకమ్మ అనే మహిళకు ఈ నెల 7వ తేదీ ఎస్‌వోటీలో శస్త్రచికిత్స చేసే సమయంలో లైట్ ఆగిపోవడంతో థియేటర్‌లో చీకటి అలుముకుంది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ వెలుతురులో ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ నెల 14వ తేదీ బుధవారం సైతం అదే ఎస్‌వోటీలో తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు శస్త్రచికిత్స చేస్తుండగా వైద్య పరికరాలు మొరాయించాయి. దీంతో మళ్లీ ఆపరేషన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక అతన్ని పక్క బ్లాక్‌లో ఉన్న ఆర్ధోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీనిపై సాక్షి మెయిన్ పేజీలో గురువారం ప్రచురితమైన ‘ఆపరేషాన్’ అనే కథనంతో జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఈ రెండు సంఘటనలు వరుసగా జరగడంతో జీజీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వైఎస్సార్ సీపీ నేతల ధర్నా
ఆస్పత్రిలో అధికారుల తీరుపై స్పందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా గంటపాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణతో కలిసి జీజీహెచ్‌లో తిరిగి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
జూనియర్ల పాలనతో ఇక్కట్లు
చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌లలో పాలనను గాలికొదిలేశారు. సీనియర్లు ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో జూనియర్‌లను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు అర్హత లేదని సాక్షాత్తు భారత వైద్య మండలి (ఎంసీఐ) తేల్చి చెప్పినప్పటికీ ఆయన్ను మార్చలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్‌రావును సీట్లో కూర్చొబెడుతూ డ్రామాలు ఆడుతున్నారు. మరో వైపు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజునాయుడును నియమించడమే కాకుండా పదవీ విరమణ అనంతరం మరో రెండేళ్లు పెంచి మరీ కొనసాగిస్తున్నారు. సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్‌లను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టడంతో పాలనపై వారు పట్టు సాధించలేకపోతున్నారు. జీజీహెచ్‌లో వరుస ఘటనలకు పరోక్షంగా వీరే కారకులవుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ నాయకుల రాజకీయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేసేందుకు కూడా వీరు వెనుకాడడం లేదనే దుర్ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment