
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు పాలనలో తలదించుకుని బతికిన దళితులు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తలెత్తుకొని తిరుగుతున్నారని ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి దళిత, రెల్లి సంఘాల నేతలు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. పాదయాత్రలో మాల, మాదిగ, రెల్లి కులస్తులకు వేర్వేరు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని..ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు.
దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను చంద్రబాబు ఎగతాళి చేశారని..వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దళితులను అక్కున చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు పనుల్లో 50 శాతం ఇచ్చారని తెలిపారు. మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment