సాక్షి, ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన గరికపాటి నాగేశ్వరరావును గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షడు కోటగిరి శ్రీధర్‌లతో కలిసి పరామర్శించారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ఉన్న నాగేశ్వరావును కలిసిన ఆళ్లనాని ఆ రోజు జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. చింతమనేని వ్యవహారాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులకు అండగా ఉండాలని ఆయన ఆదేశించారని తెలిపారు.
ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. నాగేశ్వరరావుతో పాటు మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులు తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని, విప్ పదవితో పాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. నాగేశ్వరరావును పరామర్శించిన వారిలో కొఠారు రామచంద్ర రావు, అప్పన ప్రసాద్, కమ్మ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment