నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు? | YSRCP Leaders Fires On Nimmagadda Ramesh kumar | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు?

Published Thu, Jun 25 2020 3:18 AM | Last Updated on Thu, Jun 25 2020 7:58 AM

YSRCP Leaders Fires On Nimmagadda Ramesh kumar - Sakshi

సాక్షి, అమరావతి: పార్క్‌ హయత్‌ హోటల్‌లో తాను బీజేపీ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాసరావులతో జరిపిన రహస్య భేటీపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నోరు ఎందుకు మెదపడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఆ ముగ్గురూ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో చెప్పనేలేదన్నారు. వీరి భేటీకి సంబంధించి సీసీ ఫుటేజి బయటకు వచ్చాక గానీ ‘అది రహస్య సమావేశం కాదు, బహిర్గత సమావేశమే.. కలిస్తే తప్పేంటి?’ అని ఒప్పుకుంటున్నారని అంబటి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... 

► రమేష్‌కుమార్‌.. చంద్రబాబు నియమించిన వ్యక్తి, మా వాడు, మేం కలిశాం. మేం ఏం చెబితే ఆయన అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ చెప్పాలి.
► చంద్రబాబు పంపిస్తేనే కలిశాం. రమేష్‌ కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి అయినా ఆయన్ను ఎస్‌ఈసీగా నియమించేలా మంచి ప్లీడర్లను పెట్టి వాదనలు చేయిస్తామని చెప్పండి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డను తయారు చేస్తామని చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
► ఈ ముగ్గురు కలిస్తే తప్పేంటి? అని టీడీపీలో ఒకాయన మాట్లాడుతున్నారు. హైకోర్టు జడ్జి వచ్చి మిమ్మల్ని కలిస్తే తప్పు కాదా?! టీడీపీకి వత్తాసు పలికే రెండు పత్రికలు వార్తే కాదన్నట్లు మొదటి పేజీలో వేయరు. సుజనా, కామినేని చంద్రబాబు యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు, బీజేపీ అధిష్టానం జాగ్రత్తగా ఉండాలి. బోండా ఉమా సవాలుకు స్పందిస్తూ... కాపుల సంక్షేమానికి టీడీపీ ఏం చేసిందో.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఏం చేస్తోందో.. చర్చకు సిద్ధమన్నారు.

నిమ్మగడ్డ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు 
నిమ్మగడ్డ వ్యవహారం అనుమానాలకు, అపోహలకు ఆస్కారం కలిగిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని మధ్య సమావేశం జరిగినట్లు వార్తలు రావడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలుప్రారంభమయ్యాయని, దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని, దీనిపై రమేష్‌ కుమార్‌ వివరణ ఇవ్వాలని మధు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు నిజాయతీగా వ్యవహరించాలన్నారు. 

ఎన్నికల సంఘం ప్రతిష్టను మంటగలిపారు 
మంత్రి మోపిదేవి ధ్వజం
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టను చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి మంటగలిపారని  మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మండిపడ్డారు. బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. నిమ్మగడ్డ టీడీపీ చేతిలో పావుగా మారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. 

బాబు డైరెక్షన్‌లోనే మంతనాలు
ఎమ్మెల్యే జోగి రమేష్‌
రాష్ట్ర ప్రభుత్వ పాలన ముందుకు సాగకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పన్నుతున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ బుధవారం ధ్వజమెత్తారు.  నిమ్మగడ్డ రమేష్‌కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల సమావేశ ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆ నలుగురూ చేసింది ప్రభుత్వంపై కుట్ర!
ఎంపీ విజయసాయిరెడ్డి 
నిమ్మగడ్డ రమేష్‌ రాజ్యాంగబద్ధమైన పదవిని పొందడానికి అనర్హుడని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. హోటల్‌లో జరిగిన కుట్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. ఎస్‌ఈసీ పదవిలో నిమ్మగడ్డను పెట్టి, తోలుబొమ్మలా చేసి సంక్షోభం సృష్టించడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement