
విజయవాడలో దీక్షలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సీమాంధ్ర అంతటా కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింతబలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకూ దీక్షలు చేస్తున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి బాటలో 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరవదిక నిరాహారదీక్షలు ప్రారంభించారు. విశాఖ జిల్లా గాజువాకలో నేతలు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 5 రోజులపాటు దీక్ష చేస్తామని వారు చెప్పారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టారు. విభజన ప్రకటన వచ్చిన వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులేనని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్షలు చేపట్టారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణదీక్ష ప్రారంభించారు.
నేరుగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో మంచి ఊపు వచ్చింది. తాము సైతం అంటూ దీక్షల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకొచ్చారు. ఉరవకొండలో వెయ్యి మంది దీక్షకు సిద్ధమయ్యారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ దీక్షలో కూర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చేపట్టిన సమైక్య దీక్షలో పాల్గొన్న జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా పనిచేస్తున్న నేతగా జనం వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముతున్నారని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మసీదు సెంటర్‌లో దీక్షకు దిగారు. మహత్మగాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దీక్షా ప్రాంగణానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాటపటిమ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ద్వారంపూడి చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తమనేత జగన్ అవిశ్రాంతంగా పోరాడుతారని తిరుపతి దీక్షలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమైక్యసభ జరిగి తీరుతుందన్నారు
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెంలో ఎమ్మెల్యే బాలరాజు దీక్షలో పాల్గొన్నారు. ప్రజల్లోకి సమైక్య ఉద్యమాన్ని మరింతగా తీసుకెళ్తామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన నిరహారదీక్షకు భారీగా జనం తరలివచ్చారు. గుంటూరుజిల్లా పొన్నూరులో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఆ పార్టీ సమన్వయ కర్త రావి వెంకట రమణ ఆధ్వర్యంలో రేపల్లె బస్టాండ్ సెంటర్లో దీక్షలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి 36 గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది.
రాష్ట్ర విభజనకు నిరసనగా శ్రీశైలంలో వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణా నుండి వచ్చిన భక్తులను సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సిపి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రశంసించింది. పార్టీ నిర్ణయంతో ఉద్యమం మరింత బలపడుతుందని నేతలు పేర్కొన్నారు.
మొత్తం మీద గాంధీ జయంతి రోజున ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ సమైక్య దీక్షలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తమ తరపున విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు ప్రజలు పార్టీ ప్రజాప్రతినిధులకు మద్దతు పలుకుతున్నారు.