
షర్మిల మాటల్ని వక్రీకరించొద్దు: కొణతాల
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ఇకపై ఉధృతం చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రేపటి నుంచి నవంబర్ ఒకటి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులేకాక సమైక్యవాదులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ జగన్ ప్రకటించినట్టుగానే సమైక్య శంఖారావం సభ ఈనెల 15-20 మధ్య హైదరాబాద్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలు రాజకీయాలకతీతంగా సభను విజయ వంతం చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్వేషాలను రెచ్చ గొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. వేర్పాటు వాద పార్టీలు, వ్యక్తులు సోదర భావంతో అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు.
వేర్పాటు వాదులు సీమాంధ్రలో సభలు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదన్నారు. హైదరాబాద్పై షర్మిల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. మానుకోట ఘటనను పునరావృతమవుతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. మానుకోట ఘటన వెనుక ఏయే శక్తులున్నాయో అందరికి తెలుసునని కొణతాల రామకృష్ణ అన్నారు.