ముఖ్యమంత్రి మోసగిస్తున్నారు!: కొణతాల రామకృష్ణ
-
విభజన విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నారు
-
వైఎస్సార్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ ధ్వజం
-
కిరణ్, చంద్రబాబు విభజనకు కృషి చేస్తున్నారు
-
సీఎం చేయాల్సిందంతాచేసి ఇప్పుడు సదస్సులంటున్నారు
-
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు
-
రాష్ట్రపతికి అఫిడవిట్లు ఎందుకివ్వలేదు?
-
రాజీనామాలతో సంక్షోభం సృష్టిస్తే విభజన ఆగిపోయేది
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. జనవరి 23 తర్వాత మేధోమథన సదస్సు నిర్వహించి సీఎం ఏం చర్చిస్తారని ప్రశ్నించారు. చేయాల్సిదంతా చేసి రాష్ట్రం విడిపోయాక సదస్సులు, చర్చలు నిర్వహించడం కొత్త పార్టీ కోసమేనా? అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు యూపీఏ ప్రభుత్వం తిలోదకాలిస్తోం దని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాకే విభజన ప్రారంభమవుతుందని 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రిగా చిదంబరం చెప్పారు. 2013 జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పడూ ఇదే విషయాన్ని దిగ్విజయ్ స్పష్టంచేశారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత కూడా అసెంబ్లీకి రెండు పర్యాయాలు బిల్లు వస్తుందని కేంద్రమంత్రులు, సీఎం స్వయంగా తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి కూడా ప్రజలను నిట్టనిలువునా మోసగిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంకోసం సభా నిబంధన 77, 78 కింద మా పార్టీ నోటీసులు ఇచ్చినా సభా నాయకుడిగా ఉన్న కిరణ్ ముందుకు రాలేదు. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు కూడా స్పందించలేదు. విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ పలాయనం చిత్తగించారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని అనుమానం రాకుండా అమలు చేయడం కోసం వీరిద్దరూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు’’ అని కొణతాల ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వాటిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవ్వాల్సి వస్తోందని ఆగిపోయారా? అసలు మీ వైఖరేంటని నిలదీశారు. సమైక్య తీర్మానం చేసినంత మాత్రాన విభజనను కేంద్రం నిలుపుదల చేస్తుందని తాము చెప్పడంలేదని, అయితే ప్రజల అభిప్రాయాన్ని సభ్యసమాజానికి తెలియజేసే అవకాశం దీని ద్వారా వస్తుందని వివరించారు.
వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే వారి లక్ష్యం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్‌సీపీ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కలసి నిందారోపణలు చేస్తున్నాయని కొణతాల విమర్శించారు. ‘‘2013 జూలై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ప్రకటించకముందే జూలై 25న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దానికి వక్రభాష్యం చెప్పారు. గతంలో చిదంబరం ప్రకటన తర్వాత పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభం సృష్టిస్తే అప్పట్లో విభజన ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడూ అదే మాదిరిగా చేసుంటే విభజన ఆగిపోయేది కదా? తీర్మానం వస్తుందంటూ ఇన్నాళ్లు సీఎం కిరణ్ మోసగించారు. ఇప్పుడు సభలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ పట్టుబడితే దానికీ వక్రభాష్యం చెబుతూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. విభజన బిల్లుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చర్చించాలని కిరణ్ చెప్పటం ఎంతవరకు సమంజసమన్నారు.
విద్యుత్‌రంగానికి సంబంధించి సీఎం అన్ని తప్పులే చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘‘విభజన జరిగితే విద్యుత్ విషయంలో తెలంగాణకు లోటు ఏర్పడుతుందని సీఎం చెబుతున్నారు. విద్యుత్ ప్రాజెక్టులు సీమాంధ్రలో ఉన్నప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) ప్రకారం తెలంగాణకు విద్యుత్ వెళ్తుంది. దీనివల్ల ఆంధ్ర, రాయలసీమకే 9% లోటు ఏర్పడుతుంది’’ అని వివరించారు. విభజన బిల్లుకు శాసనసభలో సవరణలు, క్లాజ్‌లు పెడతామంటూ, ఓటింగ్ అంటూ సీఎం కిరణ్ ప్రజలను మోసగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు శాసనసభకు ఉండే అధికారాలు, హక్కులు తెలిసీ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజనను అడ్డుకోవాలంటే రాజకీయ సంక్షోభమే ఏకైక మార్గమన్నారు.