'బాల్స్ అన్నీ ఆడి డకౌట్ అయిన కిరణ్'
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ బుధవారం విజయవాడలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాల్స్ అన్నీ ఆడి డకౌట్ అయిన కిరణ్ ఎవరిని ఉద్దరించటాని ఇప్పుడు రాజీనామా చేస్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు, కిరణ్కు ప్రజలే బుద్ధి చెబుతారని జోగి రమేష్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్ని మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించి తెలుగు ప్రజలను చీల్చారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలను నిట్టనిలువును చీల్చిన కాంగ్రెస్-బీజేపీలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహకరించారని ఆరోపించారు.
బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలు మోసం చేశారన్నారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు చీము, నెత్తురు ఉంటే చంద్రబాబును ఛీకొట్టాలని జోగి రమేష్ ఈ సందర్భంగా సూచించారు. చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించలేకపోవటం సిగ్గు చేటు ఆయన పేర్కొన్నారు. బాబును నమ్మకోవద్దని... రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో ఓ కన్ను...సీమాంధ్రలో ఇంకో కన్నుపోయిందని ... అటువంటి చంద్రబాబును నమ్ముకోవద్దని ఆ పార్టీ నేతలకు జోగి రమేష్ హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం లోక్సభలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం సీమాంధ్ర బంద్కు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బుధవారం విజయవాడలో సీమాంధ్ర బంద్లో జోగి రమేష్ పాల్గొని రాష్ట్ర విభజన చేసిన కేంద్ర ప్రభుత్వంతోపాటు అందుకు సహకరించిన కిరణ్, ప్రతిపక్ష నేతలు చంద్రబాబులపై నిప్పులు చెరిగారు.