'ఛత్తీస్‌గఢ్ విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదా?'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెనక్కివెళ్లే ప్రసక్తే లేదనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సీఎంగా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదా? అంటూ కొణతాల ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటన సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో, ఎఫ్‌డీఐ ఓటింగ్ సమయంలో ములాఖత్‌లు జరిపి టీడీపీ నేతలు కాంగ్రెస్‌ను గట్టెక్కించారని చెప్పారు.
సీబీఐ అరెస్ట్‌లకు జడిసి టీడీపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన సహాయంవల్లే ఇన్ని ఇబ్బందుల్లోనూ ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంటున్నారని, విభజన నిర్ణయం రాజకీయ లబ్ధికోసమే తప్ప... ప్రజలు కోసం తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న చంద్రబాబు జీవోఎంకు ఈ విషయం ఎందుకు నివేదించలేదని కొణతాల ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ సీపీకి ప్రజల్లో ఉన్న ప్రభంజనం తట్టుకోలేకే జగన్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కొణతాల రామకృష్ణ అన్నారు.