దిగ్విజయ్‌వి శుద్ధ అబద్ధాలు:కొణతాల
వైఎస్సార్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పడం శుద్ధ అబద్ధమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 2009 డిసెంబర్ 9న రాష్ట్రాన్ని చీల్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నపుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడనే లేదని, అలాంటపుడు తమ పార్టీ విభజనకు అంగీకరించిందని చెప్పడం దిగ్విజయ్‌కే చెల్లిందని విమర్శించారు.
శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోదని దిగ్విజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగువారు కలిసి ఉండాలని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిన విషయాలను ఇప్పుడు కాంగ్రెస్ తిరగదోడటంలేదా అని ప్రశ్నించారు. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటుకు శాసనసభ తీర్మానం చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం తీర్మానం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 2004, 2009లోనూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రానికి అమృత భాండాన్ని అప్పగిస్తే ఇపుడు అధిష్టానవర్గం బలవంతంగా తెలుగు ప్రజల చేత విషాన్ని మింగించేందుకు కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యం పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కనుసన్నల్లోనే విభజన...
‘‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును తమకు మిత్రుడని దిగ్విజయ్ చెబుతున్నారు. తొలి నుంచి మేం కూడా అదే చెబుతున్నాం. బాబు కనుసన్నల్లోనే విభజన ప్రక్రియ జరుగుతోంది. తనపై సీబీఐ కేసులు రాకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిన చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌కు సహకరించారు’’ అని కొణతాల ఆరోపించారు. బాబు ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నారని, కేవలం టీడీపీ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ మనుగడ సాగిస్తున్నారని పేర్కొన్నారు. కిరణ్, బాబు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తూ విభజనకు మార్గం సుగమం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘తొలి ఎస్సార్సీలో విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని పేర్కొంటూ మాయావతి అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఎందుకు పక్కన పెట్టారు? ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయించలేదు’’ అని ప్రశ్నించారు. తమ పార్టీ తొలి నుంచీ సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఇపుడు కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోందని, రాష్ట్ర విభజనను కోరుకుంటున్నవారే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన అన్యాయంగా చేస్తున్నారని, సమన్యాయం జరగలేదని అంటున్న చంద్రబాబు.. విభజన ప్రక్రియను ఆపేయాలనే ఒక్క మాట కూడా మాట్లాడ్డంలేదని ధ్వజమెత్తారు. బిల్లు తనకు చేరడానికి రాష్ట్రపతి జనవరి 23వ తేదీ వరకూ గడువు ఇచ్చారు కనుక శాసనసభ్యులు అర్థం చేసుకోవడానికి కనీసం వారికి ఒక నెల గడువిచ్చి, సంక్రాంతి తర్వాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి బిల్లుపై చర్చించాలని కొణతాల డిమాండ్ చేశారు.